ఉమ్మడి పౌరస్మృతిపై టీడీపీ స్టాండ్ ఇదే-ముస్లింలకు చంద్రబాబు క్లారిటీ..!
దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి అమలు చేసేందుకు కేంద్రంలో ఎన్డీయే సర్కార్ చేస్తున్న ప్రయత్నాలపై దేశంలోని ముస్లింలలో అభద్రతా భావం పెరుగుతోంది. దీంతో ఎక్కడికక్కడ ప్రాంతీయ పార్టీలపై వారు ఒత్తిడి పెంచుతున్నారు. ఇదే క్రమంలో ఏపీలోనూ ముస్లింలకు అధికార వైసీపీ, విపక్ష టీడీపీపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో ఆయా పార్టీల నేతలు జగన్, చంద్రబాబు ఇవాళ ముస్లింలతో భేటీ అయి వారికి క్లారిటీ ఇచ్చారు.
ముస్లిం వర్గ మనోభావాలకు వ్యతిరేకంగా టీడీపీ ఎప్పుడూ పనిచేయదని పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. యూనిఫాం సివిల్ కోడ్ పై ముస్లిం వర్గానికి అండగా నిలుస్తామని ఆయన వెల్లడించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ముస్లిం మత పెద్దలు, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నేతలు, పార్టీ మైనారిటీ నాయకులు ఇవాళ కలిశారు. కేంద్రం తెస్తున్న ఉమ్మడి పౌరస్మృతిపై టీడీపీ అభిప్రాయం చెప్పాలని కోరారు.

అలాగే కేంద్రం ప్రతిపాదిస్తున్న యూనిఫాం సివిల్ కోడ్ చట్టం పై తమ అభ్యంతరాలు, అభిప్రాయాల్ని చంద్రబాబుకు మత పెద్దలు తెలిపారు. యూసీసీ (ఉమ్మడి పౌరస్మృతి) వల్ల కేవలం ముస్లిం వర్గానికే నష్టం అనే వాదన తప్పని వివరించారు.మత స్వేచ్చకు అడ్డుపడే ఈ చట్టానికి మద్దతు ఇవ్వొద్దని చంద్రబాబును వారు కోరారు. దీంతో ముస్లింల మనోభావాలకు వ్యతిరేకంగా టీడీపీ ఎప్పుడూ పనిచేయదని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు.
యూనిఫాం సివిల్ కోడ్ పై ముస్లింల నుంచి వచ్చిన సూచనలపై అధ్యయనం చేసి, అండగా నిలుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ముస్లింల సంక్షేమం, అభివృద్దికి, ముస్లిం మత విశ్వాసాలకు టీడీపీ ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. వాటికి కట్టుబడి ఉంటుందన్నారు. యూనిఫాం సివిల్ కోడ్ పై ముస్లిం వర్గ అభిప్రాయాలు, అభ్యంతరాలు ఈ సమావేశం ద్వారా తెలుసుకున్నానని చంద్రబాబు చెప్పారు. బిల్లు విషయంలో మైనారిటీ వర్గ అభిప్రాయాలను టీడీపీ గౌరవిస్తుందని తెలిపారు.

ఉమ్మడి పౌరస్మృతి బిల్లు బిల్లు విషయంలో మీతోనే ఉంటామని ముస్లింలకు చంద్రబాబు భరోసా ఇచ్చారు. అన్ని విధాలా తోడుగా ఉంటామన్నారు. అందరి మనో భావాలు కాపాడుకుందామన్నారు. మహిళలకు ఆస్తిలో 1/3 వాటా ఇవ్వాలని పవిత్ర ఖురాన్ లో నాడే పొందుపరచబడిందని చంద్రబాబు గుర్తుచేశారు. టీడీపీ ఆవిర్భావం తరువాత ఎన్టీఆర్ నాడు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తూ చట్టం చేశారని చంద్రబాబు అన్నారు. మహిళల హక్కుల విషయంలో టీడీపీ మొదటి నుంచి ఆ వర్గానికి అండగా ఉందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications