చిటికెలేసి హెచ్చరించిన వైఎస్ జగన్ వీడియో.. అదునుచూసి దెబ్బ కొడుతున్న చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని అదును చూసి దెబ్బ కొడుతున్నారు. ఒకపక్క పార్టీలోని ముఖ్య నాయకుల పైన కేసులు, విచారణల ఒత్తిడి కొనసాగిస్తూ, మరోవైపు జగన్ పైన కూడా బ్రహ్మాస్త్రాలు సంధిస్తున్నారు. ఏపీ ప్రజలలో వ్యతిరేకతను తీసుకురావడానికి ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తున్నారు.
అసెంబ్లీ సమావేశాలకు ముందే జగన్ వర్సెస్ చంద్రబాబు
ఇక ఈనెల 18వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు ముందే సోషల్ మీడియా వేదికగా జగన్ వర్సెస్ చంద్రబాబు కొనసాగుతుంది. వైసిపి అధినేత జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం లేదనే విషయం మనకు తెలిసిందే. అయితే రాయలసీమ ప్రాంతానికి చెందిన నాయకులు అసెంబ్లీ సమావేశాలకు హాజరై, అసెంబ్లీ వేదికగా ప్రజాసమస్యలను లేవనెత్తి, అధికార పార్టీపై ఒత్తిడి తీసుకురావాలని జగన్ ను కోరుతున్నారు.

ప్రతిపక్ష హోదాపై పార్టీ శ్రేణులకు జగన్ ఆదేశం
కానీ జగన్ మాత్రం ప్రతిపక్ష హోదా ఇస్తేనే తాము శాసనసభలో అడుగు పెడతామని తేల్చి చెబుతున్నారు. అంతేకాదు ఉద్దేశపూర్వకంగానే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని జగన్ పార్టీ నాయకులను ఆదేశించారు. దీంతో వైసిపి సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని పోస్టులు పెడుతున్నారు వైసీపీ శ్రేణులు.
వైసీపీ ప్రచారానికి చెక్ పెట్టేలా ఆ వీడియోతో టీడీపీ
ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా, కావాలని వైసిపిని, వైయస్ జగన్ ను చంద్రబాబు అప్రతిష్టపాలు చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు వైసిపి శ్రేణులు. ఇక తాజాగా జరుగుతున్న ప్రచారాన్ని గమనించిన చంద్రబాబు గతంలో సభలో వైయస్ జగన్ మాట్లాడిన మాటల వీడియోలను జనాలకు చూపించాలని ఆదేశించారని సమాచారం.
నాడు సభలో ప్రతిపక్ష హోదాపై చిటికెలేసి హెచ్చరించిన జగన్
వైసిపి అధికారంలో ఉన్నప్పుడు సీఎంగా ఉన్న జగన్ సభలో చంద్రబాబును ఉద్దేశించి టిడిపి ఎమ్మెల్యేలు నలుగురు తమ వైపుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, ఆ నలుగురిని లాగేసుకుంటూ మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అంటూ చిటికలు వేసి హెచ్చరించిన వీడియోను ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తున్నారు టిడిపి శ్రేణులు
జగన్ వ్యాఖ్యలతోనే రివర్స్ ఎటాక్ మొదలెట్టిన టీడీపీ
వైసిపి అధికారంలో ఉన్నప్పుడు 10 శాతం మంది ఎమ్మెల్యేలు లేకపోతే ప్రతిపక్ష హోదా ఉండదని చెప్పింది అన్న విషయాన్ని ప్రజల మధ్యకు తీసుకు వెళుతూ, వైసిపి కి ప్రతిపక్ష హోదా లేకపోవడానికి కారణం వాళ్ల అధినేత జగనే చెప్పాడని టార్గెట్ చేయబోతున్నారు. ఏది ఏమైనా అసెంబ్లీకి వెళ్ళని జగన్ తీరు పార్టీకి భారీ నష్టం చేకూరుస్తుందని వైసిపి నేతలు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications