చంద్రబాబు రాజకీయ విశ్వరూపం: బ్రీఫ్డ్ మి కేసు ఎప్పటికీ బయటికి రాకుండా: సాయిరెడ్డి
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి.. మరోసారి విరుచుకుపడ్డారు. జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నానంటూ తన అనుకూల మీడియాతో భజన చేయించుకున్న చంద్రబాబు..తాజాగా పొలిటికల్ బ్రోకర్ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోన్నారని మండిపడ్డారు. బ్రీఫ్డ్ మి కేసు ఎప్పటికీ బయటికి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. వచ్చే కేసులు ఆగబోవని హెచ్చరించారు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకంతో చంద్రబాబు తన బ్రోకర్ రాజకీయాలను మరోసారి దేశానికి చాటి చెప్పారని నిప్పులు చెరిగారు. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కొనిపడేసి తెలంగాణాలో తన శిష్యుడికి పీసీసీ అధ్యక్ష పీఠాన్ని ఇప్పించుకున్నారని ఆరోపించారు. కిందటి ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని భ్రష్టుపట్టించాడని ఎద్దేవా చేశారు. ఇప్పుడు నేరుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీని తన అదుపులోకి తెచ్చుకున్నారని విమర్శించారు.

కేసుల నుంచి రక్షణ పొందడానికి సొంత పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులకు భారతీయ జనతా పార్టీ తీర్థాన్ని ఇప్పించిన ఘనత చంద్రబాబుదేనని చురకలు అంటించారు. బ్రీఫ్డ్ మి కేసు ఎప్పటికీ తేలకుండా తెలంగాణా పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణను గులాబి పార్టీ గూటికి చొప్పించాడని సాయిరెడ్డి ఆరోపించారు. పచ్చ రక్తం నరనరాల్లో ప్రవహించే కరడు కట్టిన అనుచరులను ముందుగానే కాంగ్రెస్‌లోకి పంపించాడని ధ్వజమెత్తారు. ఈ విషయంలో ఆయన పరోక్షంగా సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావు, రేవంత్ రెడ్డి, ఎల్ రమణ వంటి తెలుగుదేశం పార్టీ నేతలు వేర్వేరు పార్టీల్లో చేరిన అంశాన్ని ప్రస్తావించారు.












Click it and Unblock the Notifications