చంద్రబాబు క్యాంప్ ఆఫీస్‌గా లేక్ వ్యూ, స్పీకర్‌గా కోడెల!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేక్ వ్యూ అతిథి గృహాన్ని క్యాంపు కార్యాలయంగా ఉపయోగించనున్నారు. ఈ రోజు(గురువారం) నుండి ఎపి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఉదయం లేక్ వ్యూ అతిథి గృహానికి చేరుకున్నారు. సిఎస్ ఐవైఆర్ కృష్ణా రావు, పలువురు మంత్రులు చంద్రబాబు వెంట ఉన్నారు.
చంద్రబాబు బుధవారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో సీఎం క్యాంపు కార్యాలయంగా కేటాయించిన లేక్‌వ్యూ అతిథి గృహంలో అడుగు పెట్టారు. సీఎం కార్యాలయ కార్యదర్శులతో పాటు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో ఆయన భేటీ అయి కొన్ని ఫైళ్లను ఆయన పరిశీలించారు. కేబినెట్లో తీసుకున్న నిర్ణయాల ఫైలు పైన సంతకం చేశారు.

ప్రొటెం స్పీకర్‌గా కోడెల?
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా టీడీపీ సీనియర్ నేత కోడెల శివ ప్రసాదరావును ఎంపిక చేయనున్నారని సమాచారం. ఎమ్మెల్యేగా సుదీర్ఘ రాజకీయ అనుభవానికి తోడు అవసరమైన సమయాల్లో గట్టిగా వ్యవహరించగల సామర్థ్యం, చతురతల దృష్ట్యా ఆయన వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ పదవిని ఆశిస్తున్న కొందరు నేతలు బుధవారం ఇక్కడ చంద్రబాబును ఆయన నివాసంలో కలిసి మాట్లాడారు.
వీరిలో కోడెలతోపాటు మాజీ మంత్రి కళా వెంకట్రావు, గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, మాజీ చీఫ్ విప్ కాగిత వెంకట్రావు, ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. అంతిమంగా కోడెలకు అవకాశం దక్కవచ్చని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. డిప్యూటీ స్పీకర్ పదవికి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, కాల్వ శ్రీనివాసులు, బండారు సత్యనారాయణ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications