వీఓఏ ఆత్మహత్య; వైసీపీ నాయకుడి వేధింపులు; పోలీసులు స్పందించకపోవడం దారుణం: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నంలో విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న నాగలక్ష్మి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. స్థానిక వైసీపీ నాయకుడి వేధింపులు తట్టుకోలేక మనస్థాపానికి గురైన విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్ నాగలక్ష్మి బలవన్మరణానికి పాల్పడిందని సమాచారం . కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 37 సంఘాలకు బుక్ కీపర్ గా పనిచేస్తున్న నాగలక్ష్మి మండల వివోఏల సంఘం నేత కూడా, అయితే ఆమెను వేధింపులకు గురి చేసి, లంచాలు తీసుకుంటుందని ఆమె పై దుష్ప్రచారం చేసి ఆత్మహత్య చేసుకునే లాగా వైసీపీ నేత చేశారని ఆమె ఆత్మహత్య అనంతరం విషయం వెలుగులోకి వచ్చింది.

వీఓఏ ఆత్మహత్య .. వైసీపీ నాయకుడి వేధింపులు అంటూ ఆరోపణ
తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని భరించలేక, వేధింపులు సహించలేక పురుగుల మందు తాగి నాగలక్ష్మి అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడిందని సమాచారం. అంతకు ముందు ఆమె తనపై జరుగుతున్న వేధింపులపై స్పందన కార్యక్రమంలో ఎస్పీకి ఫిర్యాదు చేసింది. అయినా ఫలితం లేకపోయింది. ఇక ఇదే విషయాన్ని నాగలక్ష్మి కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. పోలీసులు పట్టించుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని వారంటున్నారు.

నాగలక్ష్మి ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించకపోవడం దారుణం: చంద్రబాబు
దీంతో నాగలక్ష్మి ఆత్మహత్య ఉదంతంపై తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ వర్గానికి రక్షణ లేదని మచిలీపట్నంలో నాగలక్ష్మి ఆత్మహత్య ఉదంతంతో మరోసారి రుజువైందని పేర్కొన్నారు. మచిలీపట్నంలో విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న నాగలక్ష్మిని అధికార పార్టీకి చెందిన వ్యక్తి వేధిస్తున్నారని ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించకపోవడం దారుణమని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

ఈ వ్యవస్థను ఏమనాలి? వారిని కఠినంగా శిక్షించాలి : చంద్రబాబు
ఒక మహిళ స్పందన కార్యక్రమంలో స్వయంగా వచ్చి ఎస్పీకి ఫిర్యాదు ఇచ్చినా చర్యలు తీసుకొని ఈ వ్యవస్థను ఏమనాలి అని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాల కంటే, బాధితుల ఆవేదన కంటే, రాజకీయ ప్రయోజనాలే పోలీసులకు ప్రాధాన్యత అంశంగా మారిపోయాయని మండిపడ్డారు. నాగలక్ష్మి ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.

నాగలక్ష్మి మృతిపై మండిపడుతున్న టీడీపీ నేతలు
ఇక తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా నేతలు సైతం నాగలక్ష్మి మృతిపై అధికార వైసీపీ ని టార్గెట్ చేస్తున్నారు. నాగలక్ష్మి కుటుంబానికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఈ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆత్మహత్య కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు.రాష్ట్రంలో ఒక పక్క హోలీ పండుగ జరుగుతుంటే, మరోపక్క వైసీపీ నేతల ఆగడాలకు అమాయకులు బలైపోతున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వైసిపి పాలనలో వేధింపులు భరించలేక అమాయక ప్రజలు ఆత్మహత్యలకు పాల్పడడం నిత్యకృత్యంగా మారిందని టిడిపి మండిపడుతుంది.












Click it and Unblock the Notifications