రాజమండ్రి నుంచి అమరావతికి భారీ ర్యాలీగా చంద్రబాబు.. రేపు తిరుమలకు టీడీపీ అధినేత!!
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు అయ్యి 53 రోజుల సుదీర్ఘ జైలు జీవితం తర్వాత మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. ఈ క్రమంలో సాయంత్రం నాలుగు గంటలకు ఆయన జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, సతీమణి బ్రాహ్మణి తో కలిసి సెంట్రల్ జైలు వద్దకు వెళ్లారు.
టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు , తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు చంద్రబాబును స్వాగతించడానికి చేరుకున్నారు.రాజమండ్రికి పెద్ద సంఖ్యలో టిడిపి నేతలు, అభిమానులు చేరుకోవడంతో అక్కడ సందడి వాతావరణం చోటు చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు స్వీట్లు పంచుకుంటూ బాణాసంచా కాల్చుతూ సంబరాలు జరుపుకుంటున్నారు.

బాబు ఈజ్ బ్యాక్, నిజం గెలిచింది వంటి హాష్ టాగ్ లను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబుకు బెయిల్ రావడంతో టీడీపీలో హడావిడి కొనసాగుతుంటే తెలుగు తమ్ముళ్ళు చంద్రబాబు అవసరం ఏపీకి ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు . ఇక చంద్రబాబు బయటకు వచ్చిన తర్వాత భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది టీడీపీ. ఇందుకోసం తెలుగుదేశం పార్టీ భారీ ఏర్పాట్లు చేసింది.
మరోవైపు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు రాజమండ్రి పాత హైవే మీదుగా అమరావతి లోని తన నివాసానికి చేరుకోనున్నారు. వేమగిరి, రావులపాలెం, పెరవలి, తణుకు, తాడేపల్లిగూడెం, భీమడోలు, దెందులూరు, ఏలూరు, హనుమాన్ జంక్షన్, గన్నవరం మీదుగా అమరావతిలోని ఉండవల్లిలోని తన నివాసానికి చంద్రబాబు ఈరోజు రాత్రికి చేరుకుంటారు.
రాజమండ్రి నుండి భారీ ర్యాలీగా ఆయన అమరావతికి చేరుకోనున్నారు. రేపు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా వెళ్లి చంద్రబాబు దర్శించుకుంటారు. అనంతరం చంద్రబాబు హైదరాబాద్ కు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. చంద్రబాబు బెయిల్ పై బయటకు రావడంతో తెలుగు తమ్ముళ్లు ఊపిరి పీల్చుకుంటున్నారు.












Click it and Unblock the Notifications