సరైన లాయర్లు లేకే, వర్షాలొస్తే.. వారు ఆపేశారు: బాధలు చెప్పిన బాబు, తెలంగాణ వాదనే
చిత్తూరు: సరైన న్యాయవాదులు లేక మనం జలాల పైన హక్కులు కోల్పోయే పరిస్థితి వచ్చిందని, మహారాష్ట్ర, తమిళనాడులలో భారీ వర్షాలు కురిసినప్పటికీ వారే ఆపుకున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఆవేదన వ్యక్తం చేశారు.
అసంబద్ధ విభజన వల్ల ఏపీ ఇబ్బందులు పడుతోందన్నారు. అయినా అధైర్యపడకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకు వెళ్తున్నామన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని శాంతిపురంలో గురువారం నిర్వహించిన దిశా నిర్దేశ సదస్సులో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు.
రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల అమలు చేయడంలో వెనక్కి తగ్గడంలేదన్నారు. విద్య, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామనిచెప్పారు. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

రూ.3లక్షల వ్యయంతో పేదలకు ఇళ్లు నిర్మించనున్నట్లు ప్రకటించారు. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందని, భావితరాలకు సంపద సృష్టించేందుకు కృషి చేయాలన్నారు. కరవురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు.
కృష్ణా, గోదావరి జలాల అంశంపై స్పందిస్తూ... ఈ ఏడాది కృష్ణా నదిలోకి నీళ్లు రాలేదన్నారు. సాగర్‌లో నీళ్లు లేవన్నారు. శ్రీశైలం, పులిచింతలలోను నీళ్లు లేవన్నారు. రాయలసీమ ప్రాంతానికి నీరు వచ్చే పరిస్థితి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కృష్ణా జలాల పైన కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా పోరాటం చేయలేదన్నారు. బ్రిజెష్ కుమార్ ట్రైబ్యునల్ ముందు సరైన వాదనలు వినిపించలేదన్నారు. సరైన న్యాయవాదులు లేక మన హక్కులు కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు. నీళ్ల సమస్య రెండు రాష్ట్రాలది కాదని, నాలుగు రాష్ట్రాలకు చెందినదన్నారు.
నీళ్లు రానప్పుడు దామాషా ప్రకారం అన్ని రాష్ట్రాలకు జలాలను సమానంగా పంచాలన్నారు. మిగులు జలాలు వాళ్లే వాడుకుంటే చివరకు ఉన్న మన రాష్ట్రం నష్టపోతుందన్నారు. రాయలసీమకు ఇబ్బంది ఏర్పడుతుందన్నారు.
కృష్ణా జలాల్లో మనకు రావాల్సిన వాటా రావాలన్నారు. వచ్చిన నీళ్లను దామాషా ప్రకారం పంచుకొని సమస్యను తీర్చుకోవాలన్నారు. కృష్ణా నది జలాలను నాలుగు రాష్ట్రాలకు పంచాలని తెలంగాణ చెబుతోంది. చంద్రబాబు కూడా అదే చెబుతున్నారు. కానీ కేంద్రం వాటాలో మహారాష్ట్ర, కర్నాటకను తప్పించాలని, పంపకం ఏపీ, తెలంగాణలకే పరిమితం చేయాలని సుప్రీం కోర్టులో చెప్పిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications