ఢిల్లీకి చంద్రబాబు- బెంగళూరుకు జగన్ పయనం..! కారణాలివే..
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ మధ్యాహ్నం ఒకరి తర్వాత మరొకరు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కోసం బయలుదేరి వెళ్లగా.. మాజీ సీఎం వైఎస్ జగన్ మరోసారి బెంగళూరుకు బయలుదేరారు. దీంతో గన్నవరం ఎయిర్ పోర్టు సందడిగా మారింది. వీరితో పాటు అసెంబ్లీ సమావేశాలు ముగించుకుని పలువురు మంత్రులు కూడా విమానాల్లో బయలుదేరారు.
సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ భేటీలో పాల్గొనేందుకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. కాసేపట్లో ఢిల్లీ చేరుకుని అక్కడే అధికారిక నివాసం వన్ జన్ పథ్ తో విశ్రాంతి తీసుకుని కేంద్రమంత్రుల్ని కలవడంతో పాటు నీతి ఆయోగ్ భేటీకి హాజరవుతారు. పోలవరం, అమరావతి ప్రాజెక్టుల్ని వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా పూర్తి చేసేలా నీతి ఆయోగ్ ముందు చంద్రబాబు ప్రతిపాదనలు పెడతారు. ఇప్పటికే నీతి ఆయోగ్ అధికారులు ఏపీకి వచ్చి వీటిపై చర్చించి వెళ్లారు.

మరోవైపు మాజీ సీఎం వైఎస్ జగన్ మరోసారి బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. ఈసారి కూడా ఆయన సతీమణి భారతీ సమేతంగా పయనమయ్యారు. ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించిన జగన్ అనంతరం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లిపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పటికే రెండుసార్లు బెంగళూరు వెళ్లి అక్కడి యలహంస ప్యాలెస్ లో విశ్రాంతి తీసుకుని వచ్చిన జగన్.. ఇప్పుడు మూడోసారి బయలుదేరి వెళ్లారు. రాష్ట్రంలో పరిణామాలను బట్టి ఆయన తిరిగి వచ్చే షెడ్యూల్ ఖరారు కానుంది.












Click it and Unblock the Notifications