ఏపీలో 41 మంది కూటమి ఎమ్మెల్యేలు మళ్లీ గెలవరా ? తాజా సర్వే సంచలనం..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలైంది. ఈ 10 నెలల్లో ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో కాస్త పక్కనబెడితే ఎమ్మెల్యేల పనితీరుపై మాత్రం క్షేత్రస్దాయిలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటికే సీఎం చంద్రబాబు నేరుగా కేబినెట్ భేటీల్లో, కూటమి పార్టీల భేటీల్లో పదే పదే హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా ఎమ్మెల్యేలు తమ పనితీరు మార్చుకోవడం లేదని మరోసారి నిరూపణ అయింది. తాజాగా వెలువడిన ఓ సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది.
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈసారి కూటమి కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని చెప్పిన సర్వే నిపుణుల్లో ప్రవీణ్ పుల్లట ఒకరు. ఆయన చెప్పిన అంచనాలు ఎన్నికల్లో దాదాపు నిజమమయ్యాయి. దీంతో కూటమి ఘన విజయం సాధించింది. అయితే గెలుపు తర్వాత కూటమి పనితీరు ఆశాజనకంగా లేదని ఇప్పటికే పలుమార్లు ట్వీట్ల రూపంలో వెల్లడించిన ప్రవీణ్ పుల్లట తాజా గణాంకాల ప్రకారం ఈసారి 41 మంది కూటమి ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్ రాదని, వచ్చినా ఓడిపోతారని ఎక్స్ లో ట్వీట్ చేశారు. దీంతో ఆయన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.

కూటమి ప్రభుత్వానికి సంవత్సరం పూర్తికావస్తున్న తరుణంలో త్వరలో మరిన్ని సంచలనాలు బయటపెడతానంటూ ప్రవీణ్ పుల్లట మరో ట్వీట్ చేశారు. 92 శాతం వన్ టైమ్ ఎమ్మెల్యేలు మొదటిసారి, చివరి సారి అంటూ మరో కామెంట్ కూడా పెట్టారు. అయితే ఇది ఎవరి గురించి అన్న విషయం మాత్రం చెప్పలేదు. దీంతో త్వరలో ప్రవీణ్ పుల్లట పూర్తిస్దాయిలో సర్వే బయటపెడతారా లేక ఇలా హింట్స్ తో సరిపెడతారా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
దాదాపు 41 మంది కూటమి ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదూ.. టిక్కెట్ దక్కడమూ అసాధ్యమే!#RISEResearch @highlight
— Praveen Pullata (@praveenpullata) April 28, 2025
( తాజా గణాంకాల ప్రకారం..)
సంవత్సరం కావస్తున్న తరుణంలో మరిన్ని సంచలనాలు.... 92 శాతం వన్ టైమ్ ఎమ్మెల్యేలు ( మొదటిసారి.. చివరిసారి..) #drpraveenpullata
— Praveen Pullata (@praveenpullata) April 28, 2025
రాష్ట్రంలో భారీ అంచనాలతో 164 సీట్లతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ తర్వాత మాత్రం అంచనాలకు తగినట్లుగా పనిచేయలేకపోతోందన్న చర్చ రాష్ట్రంలో జరుగుతోంది. ముఖ్యంగా గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల్ని పూర్తి స్దాయిలో అటకెక్కించేయడం, దీనిపై ప్రశ్నించే పరిస్ధితి లేకుండా చేయడం వంటివి ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచుతున్నాయి. గతంలో ప్రవీణ్ పుల్లట కూడా తన ట్వీట్ లో పల్లెల్లో డబ్బులు రొటేషన్ కావడం లేదని, సంక్షేమ పథకకాలు అమలు చేయకపోవడమే దీనికి కారణమని వెల్లడించారు.












Click it and Unblock the Notifications