ఆకస్మిక తనిఖీలు: నడిరోడ్డుపై చంద్రబాబు కొబ్బరి బొండాం తాగారు
నెల్లూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలతో కలిసి పోయే ప్రయత్నాలు చేస్తున్నారు. శుక్రవారం నెల్లూరు నగర పర్యటనలో భాగంగా ప్రజలతో సాధారణ పౌరుడిలా కలిసిపోయారు.
నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు శుక్రవారం రాత్రి అక్కడే బస చేసి శనివారం ఉదయం తెల్లవారకముందే నగర వీధుల్లోకి వచ్చేశారు. పారిశుద్ధ్యంపై అధికారులకు క్లాస్ తీసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు రోడ్డు పక్కగా కొబ్బరి బోండాలు అమ్ముతున్న మహిళ వద్దకు వెళ్లారు. ఆమె ఇచ్చిన కొబ్బరి బోండాంను స్వీకరించిన చంద్రబాబు అక్కడే రోడ్డుపై నిలబడే కొబ్బరి నీటిని తాగారు.

నగరంలోని వెంగళరావునగర్, దర్గామిట్ట, రాంనగర్, గాంధీనగర్, బ్రహ్మానందపురం తదితర ప్రాంతాల్లో కలియదిరిగిన చంద్రబాబు ప్రజలతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో ప్రజలకు మౌలిక వసతులను కల్పిస్తామని ఆయన చెప్పారు.
నెల్లూరు నగరంలో ఆకస్మిక తనిఖీలు జరిపిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా అభివృద్ధి కోసం పారిశ్రామికవేత్తలు కృషి చేయాలని కోరారు. నగరంలోని స్వర్ణాల చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. తాను వచ్చే నెలలో మళ్లీ నెల్లూరులో పర్యటిస్తానన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో ప్రైవేటు సంస్థలను భాగస్వాములను చేస్తామని సీఎం వివరించారు.












Click it and Unblock the Notifications