సీఎంగా తొలిరోజే చంద్రబాబు మార్క్.. ఇచ్చిన మాటకు కట్టుబడి కీలక సంతకాలు!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. సాయంత్రం నాలుగు గంటల 41 నిమిషాలకు సచివాలయం మొదటి బ్లాక్ లోని తన చాంబర్లో చంద్రబాబు సీఎంగా బాధ్యతలను స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు చేసి, సీఎం గా బాధ్యతలు చేపట్టారు చంద్రబాబు.
మెగా డీఎస్సీ పై తోలి సంతకం చేసిన సీఎం చంద్రబాబు
సీఎంగా చంద్రబాబు బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర, పయ్యావుల కేశవ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలముందు చంద్రబాబు ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలలో భాగంగా మెగా డీఎస్సీ ఫైల్ పైన మొదటిసంతకం చేశారు. ఏపీలో తమ ప్రభుత్వం వస్తే ఉద్యోగాల భర్తీకే మొదటి ప్రాధాన్యత అని చెప్పిన చంద్రబాబు ఆ పని చేశారు.

రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై చేసిన చంద్రబాబు
ఆపై చంద్రబాబు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైల్ పైన రెండవ సంతకాన్ని చేశారు. ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే ప్రజల భూములకు రక్షణ ఉండదని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు, అధికారంలోకి వస్తే ఈ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పిన మాటకు కట్టుబడి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైలుపై సంతకం చేశారు.
పించన్ల పెంపు, అన్నా క్యాంటీన్లు, నైపుణ్య గణనపైనా బాబు సంతకాలు
ఇక మూడవ సంతకం సామాజిక పింఛన్ల పెంపు నాలుగు వేలకు చేస్తూ ఆ ఫైల్ పైన మూడవ సంతకాన్ని చేశారు . అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ పైన నాలుగో సంతకాన్ని, నైపుణ్య గణన పైన ఐదవ సంతకాన్ని చేశారు. ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు మెగా డీఎస్సీ ఫైల్ పైన తొలి సంతకాన్ని చేసి రాష్ట్రంలో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
బాధ్యతలు చేపట్టిన నాడే చంద్రబాబు మార్క్ పాలన
మొత్తం ఐదు కీలక నిర్ణయాలను తీసుకున్న చంద్రబాబు పాలనా పగ్గాలు చేపట్టిన తొలి రోజే తన మార్క్ పాలనను చూపించారు. ప్రజా సంక్షేమానికే పెద్ద పీట వేస్తున్నానని, ఇచ్చిన మాటకు కట్టుబడి పాలన చేస్తానని, తనకు అధికారం ఇచ్చిన ప్రజల కోసం, వారి ఆకాంక్షల మేరకు పని చేస్తానని తన నిర్ణయాలతో చెప్పే ప్రయత్నం చేశారు.












Click it and Unblock the Notifications