సీజేఐ ఎన్వీ రమణతో చంద్రబాబు భేటీ - మూడేళ్ల తరువాత..!!
సీజేఐ ఎన్వీ రమణతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. దాదాపు మూడేళ్ల తరువాత ఇద్దరు కలుసుకున్నారు. సీజేఐ ఎన్వీ రమణ విజయవాడ చేరుకున్నారు. నగరంలో కొత్తగా నిర్మించిన కోర్టు భవనాలను ముఖ్యమంత్రితో కలిసి సీజేఐ ప్రారంభిస్తున్నారు. నగరానికి చేరుకున్న సీజేఐ ఒక హోటల్ లో బస చేసారు. ఆయన్ను సీఎం జగన్ మర్యాద పూర్వకంగా కలిసారు. ఇదే సమయంలో చంద్రబాబు హోటల్ లో సీజేఐతో సమావేశమయ్యారు. జస్టిస్ ఎన్వీ రమణను చంద్రబాబు మూడేళ్ల తరువాత కలిసారు.

సీజేఐ హోదాలో తొలి సారిగా
అమరావతి శంకుస్థాపనకు ప్రధాని మోదీ వచ్చిన సమయంలో నాడు జస్టిస్ ఎన్వీ రమణ ఆ కార్యక్రమంలో హాజరయ్యారు. ఆ తరువాత అమరావతిలో హైకోర్టు తాత్కాలిక భవనం ప్రారంభోత్సవం 2019 ఫిబ్రవరిలో జరిగింది. నాటి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ హైకోర్టు భవనాలను ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. ఇక..సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి సారి హైదరాబాద్ - అమరావతి వచ్చిన సందర్భాల్లోనూ చంద్రబాబు ఆయనతో సమావేశం కాలేదు.

నాడు అమరావతి కార్యక్రమాల్లో
హైదరాబాద్ లో సీజేఐ హోదాలో తొలి సారి వచ్చిన వేళ..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. రాజ్ భవన్ లో బస చేసిన సీజేఐ ను అనేక పార్టీల నేతలు మర్యాద పూర్వకంగా కలిశారు. కానీ, చంద్రబాబు దూరంగా ఉన్నారు. ఇక, ఏపీ పర్యటన సమయంలో పూర్తిగా అధికారిక కార్యక్రమాలే షెడ్యూల్ చేశారు. ఇప్పుడు విజయవాడ వచ్చిన సీజేఐ అధికారిక కార్యక్రమాలతో పాటుగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకోనున్నారు. ఈ నెల 27న సీజేఐ ఎన్వీ రమణ పదవీ విరమణ చేయనున్నారు.

సీజేఐ బిజీ షెడ్యూల్
దీంతో..విజయవాడకు వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణను కలిసిన చంద్రబాబు ఆయనకు వెంకటేశ్వరుని ప్రతిమను అందించి..సత్కరించారు. ముఖ్యమంత్రి జగన్ సైతం సీజేఐతో భేటీ కావటంతో పాటుగా.. ఇద్దరూ కలిసి కోర్టు భవనాల ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు. సీజేఐ కు గౌరవ డాక్టరేట్ ప్రధానం అనంతరం ఏపీ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి జగన్ సీజేఐ గౌరవార్ధం విందు ఏర్పాటు చేశారు.
ఇందులో గవర్నర్ తో పాటుగా.. హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొంటారు. ఆ తరువాత వ్యక్తిగత పర్యటన నిమిత్తం గుంటూరు వెళ్తారు. సాయంత్రం తన స్వగ్రామం పొన్నవరం వెళ్లి.. రాత్రికి హైదరాబాద్ బయల్దేరనున్నారు.












Click it and Unblock the Notifications