అమరావతిలో ఒకే జేఏసీ..! తేల్చేసిన చంద్రబాబు- రీజన్ ఇదే..!
ఏపీ రాజధాని అమరావతిలో పునర్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. తాజాగా 15 బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థలకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వచ్చి శంఖుస్థాపన చేసి వెళ్లారు. అంతకు ముందే అమరావతి రైతుల్లో అసంతృప్తి గమనించి సీఎం చంద్రబాబు వారితో నేరుగా భేటీ అయ్యారు. సమస్యల పరిష్కారంపై కీలక చర్చలు జరిపారు. కానీ తాజాగా మరోసారి రైతులు చంద్రబాబును సమస్యలతో పలకరించారు. దీంతో ఆయన వారికి ఓ కీలక సలహా ఇచ్చారు.
అమరావతి రాజధానిలో రైతులు, మహిళలు ఇలా విడివిడిగా జేఏసీలు ఏర్పాటు చేసుకోవడంపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వారంతా ఒకే జేఏసీగా ఉండాలని చంద్రబాబు సలహా ఇచ్చారు. అప్పుడే ప్రభుత్వం వారితో ఏ విషయంపై అయినా చర్చించేందుకు సులువుగా ఉంటుందని సూచించారు. అదే సమయంలో అమరావతిలో సమస్యలు కూడా వేగంగా పరిష్కారం అవుతాయని వారికి తెలిపారు.

అయితే ఇంతకీ రాజధానిలో ఒకే జేఏసీ ఉండాలని చంద్రబాబు చేసిన సూచన వెనుక ఏముందనే చర్చ జరుగుతోంది.గతంలో అమరావతిని రాజధానిగా ఎంపిక చేసి అభివృద్ధి చేస్తున్న క్రమంలో ప్రభుత్వం మారడంతో మూడు రాజధానులు తెరపైకి వచ్చాయి. ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా అమరావతిలో పోరాటాలు జరిగాయి. దీని కోసం పలు జేఏసీలు ఏర్పడ్డాయి. ఇవన్నీ కలిసి అమరావతికి మద్దతుగా భారీ పోరాటాలు చేశాయి. కేసుల్ని ఎదుర్కొన్నాయి. చివరికి అమరావతి పునర్ నిర్మాణం చేసే ప్రభుత్వాన్నిఅధికారంలోకి తెచ్చుకున్నాయి. కానీ ఇప్పుడు అవే జేఏసీలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతున్నాయి. చర్చలకు ఒకరిని పిలిచి నిర్ణయం తీసుకుంటే మరొకరు అభ్యంతరాలు చెప్తున్నారు. దీంతో సీఎం ఈ సూచన చేశారు.

దీంతో పాటు అమరావతిలో అధికారులు తమను చికాకు పెడుతున్నారని, చిన్న పనుల కోసం కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని రైతులు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు.. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల్ని ఇబ్బందిపెడితే సహించబోమని అధికారుల్ని హెచ్చరించారు. అమరావతిలో రెవెన్యూ, సీఆర్డీఏ అధికారులపై వస్తున్న ఫిర్యాదులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications