ఢిల్లీకి బాబు: బిజెపియేతర పార్టీలతో మీటింగ్, ఏం జరుగుతోంది?
Recommended Video

అమరావతి: ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగానే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సోమవారం నాడు డిల్లీకి బయలుదేరారు. ఢిల్లీకి వెళ్ళే ముందు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులతో చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు.
బిజెపియేతర పార్టీలతో కూటమి ఏర్పాటు విషయంలో చంద్రబాబునాయుడు చర్చించే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలను పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. పార్లమెంట్ సెంట్రల్ హల్‌లో బిజెపియేతర పార్టీల నేతలతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీలో సమావేశం కానున్నారు.
ఏపీకి ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపిస్తూ ఎన్డీఏ నుండి టిడిపి బయటకు వచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై ప్రస్తుతం అధికార టిడిపి, విపక్ష వైసీపీలు పోటాపోటీగా పోరాటాలు చేస్తున్నాయి.
ఢిల్లీ పర్యటనకు వెళ్ళే ముందు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పార్టీ సుదీర్ఘంగా సమావేశం నిర్వహించారు. ఢిల్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలతో బాబు చర్చించారు.

రాష్ట్రం కోసమే బాబు ఢిల్లీకి
రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్ళారని ఏపీ మంత్రి కళా వెంకట్రావు చెప్పారు. చంద్రబాబునాయుడుతో సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబునాయుడు ఏ నిర్ణయం తీసుకొన్నా టిడిపి శాసనసభపక్షం కట్టుబడి ఉంటుందని కళా వెంకట్రావు ప్రకటించారు.

జాతీయ పార్టీల నేతలతో సమావేశం
పార్లమెంట్ సెంట్రల్ హల్‌లో అవిశ్వాసానికి మద్దతిచ్చిన ఆయా రాజకీయ పార్టీల పార్లమెంటరీ పార్టీల నేతలతో చంద్రబాబునాయుడు సమావేశం కానున్నారు. ప్రత్యేకహోదాకు మద్దతిచ్చినందుకు ఆయా పార్టీల నేతలకు ధన్యవాదాలు తెలపనున్నారు. పార్లమెంట్ సెంట్రల్ హల్ లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత మల్లిఖార్జున ఖర్గేతో కూడ చంద్రబాబునాయుడు సమావేశం కానున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

బిజెపియేతర పార్టీలతో కూటమి
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటన రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణాల్లో కొత్త సమీకరణాలకు తెరతీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బిజెపియేతర పార్టీలతో చంద్రబాబునాయుడు కూటమిని కూడ ఏర్పాటు చేసే అవకాశాలు కూడ కొట్టిపారేయలేమని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే రాజకీయ పరిణామాల్లో శరవేగంగా మార్పులు చోటు చేసుకొనే అవకాశాలు లేకపోలేదన్నారు. బిజెపి మిత్ర ధర్మాన్ని పాటించలేదని టిడిపి నేతలు గుర్తు చేస్తున్నారు.

బిజెపికి బుద్దిచెబుతాం
బిజెపికి తగిన బుద్దిచెబుతామని ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రకటించారు. చంద్రబాబునాయుడుతో సమావేశం ముగిసిన తర్వాత సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు.విభజన హమీలను అమలయ్యేవరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదా సాధనే ఎజెండాగా చంద్రబాబు ఢిల్లీ టూర్ కొనసాగుతోందని సోమిరెడ్డి చెప్పారు.

శత్రువులతో మోడీ స్నేహం
మిత్రపక్షాలను తొక్కేసి శత్రుపక్షాలతో మోదీ చేతులు కలుపుతున్నారని టిడిఎల్పీ సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని అన్ని పార్టీల నేతలకు చెప్పాలని టిడిపి నేతలు బాబు దృష్టికి తీసుకొచ్చారు. సీబీఐ కేసులున్న వైసీపీతో బీజేపీ చేతులు కలపడాన్ని జాతీయ పార్టీల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. విభజనకు కారణమైన కాంగ్రెస్‌ను కలవడం సరికాదని పలువురు ఎమ్మెల్యేలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అవిశ్వాసానికి మద్దతు ఇచ్చిన అందరినీ కలిసి కృతజ్ఞతలు చెప్పాలని మరికొంతమంది ఎమ్మెల్యేలు చంద్రబాబుకు సూచించారు.












Click it and Unblock the Notifications