సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు-నిర్మలమ్మకు ఇచ్చే చిట్టా రెడీ..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ఢిల్లీ పర్యటనకు సిద్దమవుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పలుమార్లు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి కీలక అంశాల్లో ఆర్ధిక సాయంతో పాటు ప్రాజెక్టుల్నీ సాధించుకున్న చంద్రబాబు.. ఇప్పుడు మరోసారి హస్తిన వెళ్లబోతున్నారు. రేపు ఎకనామిక్ టైమ్స్ నిర్వహించే సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లబోతున్న చంద్రబాబు.. ఈ సందర్భంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసేందుకు అపాయింట్ మెంట్ తీసుకున్నారు.
ఇవాళ సాయంత్రం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి చంద్రబాబు బయలుదేరి వెళతారని టీడీపీ ప్రకటించింది. సాయంత్రం 6 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళతారని తెలిపింది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ తో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ది కార్యక్రమాలకు కేంద్ర మంత్రికి వివరించి ఆర్థిక సాయం కోరనున్నారు.

సాస్కి తో పాటు పూర్వోదయ పథకం తరహాలో కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా రాష్ట్రానికి నిధులు కేటాయించాలని చంద్రబాబు ఆమెను విజ్ఞప్తి చేయనున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని ఓ ప్రైవేటు హోటల్ లో ఎకనమిక్ టైమ్స్ నిర్వహించే వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సుకు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. రేపు రాత్రి సీఎం చంద్రబాబు ఢిల్లీ నుంచి అమరావతికి తిరుగు ప్రయాణం అవుతారని టీడీపీ వర్గాలు తెలిపాయి.

రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కేంద్రం ఏపీకి పలు ప్రాజెక్టుల్ని కేటాయిస్తోంది. ఇందులో పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో పాటు అమరావతిలో ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. తాజాగా సర్వశిక్ష అభియాన్ కు సంబంధించిన కార్యక్రమాలకు కూడా సాయాన్ని ప్రకటించింది. దీంతో రాష్ట్రానికి అన్ని విధాలా మేలు జరుగుతోందని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications