పవన్, కిరణ్ పార్టీలపై బాబు: టి, సీమాంధ్రను కలిపే శక్తి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పెట్టబోయే కొత్త పార్టీలపై ఆదివారం స్పందించారు. మాజీ మంత్రులు టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డిలు పార్టీలో చేరిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.
చాలామందికి పార్టీ పెట్టాలనే ఆలోచన ఉండవచ్చునని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడే కిరణ్ ఏమీ చేయలేకపోయారని, ఇక ఐదారుగురు ఎమ్మెల్యేలతో కలిసి ఏం చేస్తారని ప్రశ్నించారు. కిరణ్ కుమార్ రెడ్డికి ఓటు వేస్తే మురిగిపోతుందని చెప్పారు. మరికొందరు పార్టీ పెట్టాలనుకుంటున్నారని, దానిపై తర్వాత మాట్లాడుతానని చెప్పారు.

కొత్తగా పార్టీలు పెట్టే వారికి చంద్రబాబు హితవు పలికారు. కొత్తగా పార్టీలు పెట్టి ఏ పది స్థానాల్లోనో అభ్యర్థులను నిలబెట్టి ఏం సాధిస్తారన్నారు.కొత్త పార్టీలు పెట్టడం మాని టిడిపికి మద్దతివ్వాలన్నారు. తెలుగుదేశం బలపడితే తెలుగుజాతి బలంగా తయారవుతుందని చెప్పారు. ఇప్పటికే దెబ్బతిన్న తెలుగుజాతి మనోస్థైర్యం తమ చర్యల ద్వారా మరింత దెబ్బతినకుండా చూసుకోవాలని హితవు పలికారు.
రెండు రోజుల్లో పార్టీ తెలంగాణ కమిటీపై నిర్ణయం తీసుకుంటామన్నారు పొత్తులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. సీమాంధ్రలో కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణలో కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలతో తాము పొత్తు పెట్టుకోలేమన్నారు.
విభజన అనంతరం టిడిపిలోకి తెలంగాణ ప్రాంతం నుంచి కూడా వలసలు కొనసాగుతున్నాయన్నారు. ఇప్పటికే కొందరు పార్టీలోకి వచ్చారని, మరికొన్ని రోజుల్లో ఇంకొందరు వస్తారని చెప్పారు. రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేసి తన నిజాయతీని నిరూపించుకుంటానని బాబు ధీమాగా చెప్పారు. విడిపోయిన రెండు ప్రాంతాలను కలిపే శక్తి టిడిపికే ఉందన్నారు.












Click it and Unblock the Notifications