అలా అంటారా, సిగ్గు లేదు: చెప్పుతో కొట్టాలనే జగన్ వ్యాఖ్యలపై బాబు
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబును చెప్పుతో కొట్టాలని జగన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై చంద్రబాబు ప్రతిస్పందించారు.
జైలుకెళ్లి వచ్చిన జగన్ సిగ్గులేకుండా ఆరోపణలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం ఏ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన నవనిర్మాణ దీక్ష కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. జగన్ చాలా నీచంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిని కొట్టాలని చెప్పే ప్రతిపక్ష నేత ఉండటం మన దురదృష్టకరమని చంద్రబాబు అన్నారు. ఇలాంటి రౌడీ, నేరస్థుడు విపక్షనేతగా ఉంటే పెట్టుబడులు పెట్టేవారు భయపడతారని ఆయన అన్నారు.

జగన్ లాంటివాళ్లకు రాజకీయాల్లో ఉండే అర్హత లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కాపు ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని తునిలో విధ్వంసం సృష్టించారని ఆయన మరోసారి మండిపడ్డారు. అమరావతి శంకుస్థాపనకు పిలిచినా జగన్ రాలేదనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నవ నిర్మాణ దీక్షలు చేస్తుంటే అనంతపురం వెళ్లి ప్రజలను రెచ్చగొడుతున్నారని చంద్రబాబు చెప్పారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో విపక్షానికి రెండు సీట్లు కూడా రావని చంద్రబాబు జోస్యం చెప్పారు.
ఆర్థిక నేరస్థుడు
జగన్ ఆర్థికనేరస్థుడు..అభివృద్ధి నిరోధకుడని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. జగన్ ప్రవర్తనను సొంత ఎమ్మెల్యేలే అసహ్యించుకుంటున్నారని ఆయన మీడియాతో శుక్రవారం అన్నారు. జగన్‌కు మతిభ్రమించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని జగన్ మాట్లాడాలని మంత్రి నారాయణ సూచించారు.
జగన్ దెబ్బలు తింటారు...
రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్న వైఎస్ జగన్ త్వరలో ప్రజలతో చెప్పు దెబ్బలు తింటారని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గాజువాక జోనల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన నవనిర్మాణ దీక్ష కార్యకమ్రంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాల్సిన ప్రతిపక్ష నేత జగన్ అమరావతి నిర్మాణానికి స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులను రెచ్చగొట్టేందుకు యత్నించడం సిగ్గుచేటన్నారు.
రైతు భరోసా యాత్ర పేరిట రైతులను మోసం చేయవద్దని ఆయన జగన్‌కు సూచించారు. రాష్ట్ర విభజనతో అన్నివిధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలూ కృషిచేస్తుంటే అసమర్థ ప్రతిపక్ష నేత జగన్ అడుగడుగునా అడ్డుతగులుతున్నారని విమర్శించారు. రాష్ట్ర మనుగడను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న జగన్‌కు భవిష్యత్తులో ప్రజలే తగినవిధంగా బుద్ధి చెప్తారని ఆయన అన్నారు.
వైఎస్ సరిగా పెంచలేదు....
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేసిన తప్పుల్లో కుమారుడు జగన్‌ను సరిగా పెంచకపోవడం ఒకటని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఆర్థిక నేరాలకు సంబంధించి 13 కేసుల్లో జగన్ ఏ1 ముద్దాయిగా ఉన్నాడని ఆయన గుర్తుచేశారు. ఈ కేసుల విచారణను ఏడాదిలోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందన్నారు. కేసుల విచారణ పూర్తయితే ప్రజలు ఎవరిని కొడతారో తెలుస్తుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications