Anna Canteen: అన్న క్యాంటీన్లపై మారిన చంద్రబాబు ప్లాన్..! కారణమిదే..?
ఏపీలో గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన 183 అన్న క్యాంటీన్లు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మూసేసింది. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్లీ ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇందుకోసం ప్రభుత్వం వేసుకున్న ప్రణాళికలకు అనుగుణంగా క్షేత్రస్ధాయిలో పనులు సాగడం లేదు. ఇప్పటికే ఆగస్టు 15న అన్న క్యాంటీన్లను పునరుద్దరిస్తామని చెప్పిన ప్రభుత్వం తాజాగా ప్లాన్ మార్చింది.
రాష్ట్రంలో 183 అన్న క్యాంటీన్లను ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రారంభించాల్సి ఉంది. ఆ తర్వాత మరో 40 వరకూ క్యాంటీన్లను కొత్తగా ప్రారంభించాలని నిర్ణయించారు. కానీ ప్రభుత్వం ఎంత ఫాలో అప్ చేస్తున్నా క్షేత్రస్ధాయిలో పనులు మాత్రం పూర్తి కావడం లేదు. చాలా చోట్ల క్యాంటీన్లను సిద్దం చేసే విషయంలో అధికారులు నత్తనడకన ఉన్నారు. దీంతో తాజా అంచనా ప్రకారం ఆగస్టు 15 నాటికి ఇందులో సగానికి పైగా మాత్రమే పునఃప్రారంభం కానున్నాయి.

ఆగస్టు 15 కల్లా 100 క్యాంటీన్లను పునరుద్ధరించేందుకు తాము సిద్ధమని అధికారులు తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వాటి వివరాలను ఆందించారు. దీంతో ప్రభుత్వం కూడా చేసేది లేక 100 క్యాంటీన్లను ఆగస్టు 15న, మరో 83 క్యాంటీన్లను సెప్టెంబర్ లో ప్రారంభించేందుకు అంగీకరించింది. అలాగే మిగిలిన కొత్త క్యాంటీన్ల ప్రారంభానికి మరికొంత సమయం పట్టొచ్చని భావిస్తున్నారు. ఈ లెక్కన ఈ ఏడాది చివరి నాటికి పూర్తి స్ధాయిలో అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి.












Click it and Unblock the Notifications