జగన్ బాకీలన్నీ తీర్చేస్తున్న చంద్రబాబు-ఈ నెలలో ఎన్ని వేల కోట్లో తెలుసా ?
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చిన విషయాల్లో బిల్లుల బకాయిలు కూడా ఒకటి. ప్రభుత్వం మారిందనే సాకుతో గత ప్రభుత్వంలో చేసిన పనులకు కాంట్రాక్టర్లకు, అలాగే ఇతర వర్గాలకు చెల్లించాల్సిన బిల్లుల్ని అప్పట్లో పెండింగ్ పెట్టేశారు. దీంతో ఆ బిల్లుల క్లియరెన్స్ కోసం కాంట్రాక్టర్లు, ఆయా వర్గాలు హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. హైకోర్టు ఉత్తర్వుల్ని కూడా లెక్కచేయకుండా బిల్లులు క్లియర్ చేయని అధికారులు ఏకంగా కోర్టు బోనులో నిలబడాల్సి వచ్చింది.
సీన్ కట్ చేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ తప్పిదాన్ని కొనసాగించకుండా జాగ్రత్త పడుతోంది. అందుకే ఓవైపు అభివృద్ధి పనులకు ప్రాధాన్యమిస్తూనే మరోవైపు పాత ప్రభుత్వ బిల్లుల్ని క్లియర్ చేసుకుంటూ వస్తోంది. ఇదే క్రమంలో ఇప్పటికే పలు వర్గాలకు పెండింగ్ లో ఉన్న బిల్లుల్ని క్లియర్ చేసేస్తున్నారు. ఈ జనవరి నెలలోనే ఏకంగా 8 వేల కోట్ల మేర బిల్లుల్ని క్లియర్ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

ముఖ్యంగా 2025 ఏడాది ప్రారంభం నుంచి పెండింగ్ బిల్లుల చెల్లింపులపైనే ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో ఉన్నా..పెండింగ్ బిల్లుల చెల్లింపుల పైనే చంద్రబాబు సర్కార్ దృష్టి సారిస్తోంది. పెండింగ్ బిల్లులపై ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్.. ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబుకు డీటైల్ట్ నోట్ ఇస్తున్నారు. దీంతో వివిధ వర్గాలకు గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బిల్లులను ప్రణాళికా బద్దంగా ప్రభుత్వం జమ చేస్తోంది.
ఈ క్రమంలోనే విద్యార్ధులకు ఫీజు రీ-ఇంబర్సుమెంట్ బకాయిల చెల్లింపులతో ఆరున్నర లక్షల మంది విద్యార్థుల చేతుల్లోకి సర్టిఫికెట్లు వచ్చాయి.ఐదేళ్లుగా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన పోలవరం నిర్వాసితులకు పరిహరం చెల్లింపులు జరిగాయి. అలాగే అమరావతి రైతులకు కౌలు చెల్లింపులూ క్లియర్ చేశారు. గత ప్రభుత్వ విధానాలతో ఇబ్బంది పడ్డ వివిధ శాఖల ఉద్యోగులు, పోలీసులు, చిన్న కాంట్రాక్టర్లకు ఊరటనిచ్చేలా పెండింగ్ నిధుల విడుదల జరుగుతోంది. పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ తో ఒకేసారి 26వేల మంది చిన్న కాంట్రాక్టర్లు ఒడ్డున పడుతున్నట్లు సమాచారం. ఇలా పోలవరం నిర్వాసితులకు రూ.1000 కోట్లు, ఉద్యోగులకు చెల్లింపుల కింద రూ.1300 కోట్లు, ఫీజు రీ-ఇంబర్సుమెంట్ బిల్లు రూ. 788 కోట్లు క్లియర్ చేశారు.












Click it and Unblock the Notifications