తుంగభద్ర డ్యామ్ గేట్ కొట్టుకుపోయిన ఘటనపై చంద్రబాబు సమీక్ష.. హై అలెర్ట్!
కర్ణాటక రాష్ట్రంలో భారీ వర్షాలతో కృష్ణానది వరద ఉప్పొంగుతోంది. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అనూహ్య సంఘటనలో ఒక్కసారిగా పోటెత్తిన వరద ధాటికి తుంగభద్ర డ్యామ్ గేటు ఒక్కసారిగా తెగి వేల క్యూసెక్కుల నీరు దిగువకు పోటెత్తింది. ఫలితంగా దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీర ప్రాంతాలలో హై అలెర్ట్ ప్రకటించారు అధికారులు.
తుంగభద్రా డ్యాం గేటు తెగి నీళ్ళు దిగువకు
కర్ణాటక రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో కృష్ణ, తుంగభద్ర, కావేరి వంటి నదులలో వరద పోటెత్తుతోంది. ఆయా నదులపై కట్టిన ఆనకట్టలు గరిష్ట నీటి స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో జల వనరుల శాఖ అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇదే క్రమంలో తుంగభద్ర రిజర్వాయర్ కు చెందిన తెగి గేటు విరిగిపడి కొట్టుకుపోయింది. 35 వేల క్యూసెక్కులకు పైగా వరద నీరు దిగువకు పోటెత్తుతోంది.

తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోయిన సంఘటనపై చంద్రబాబు సమీక్ష
ఇక ఈ క్రమంలో తుంగభద్ర డ్యామ్ గేట్ కొట్టుకుపోయిన సంఘటనపైన ఏపీ జలవనుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోయిన సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారని పేర్కొన్నారు. తుంగభద్ర డ్యామ్ సంఘటన ప్రదేశానికి చంద్రబాబు ఆదేశాలతో సెంట్రల్ డిజైన్ కమిషనర్ తో పాటు ఇంజనీరింగ్ డిజైన్స్ బృందాన్ని కూడా ఏర్పాటు చేసి పంపించడం జరిగిందని నిమ్మల రామానాయుడు వెల్లడించారు.
ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
డ్యాం గేటు కొట్టుకుపోయినందున ప్రజలను అప్రమత్తం చేసేలా జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. తుంగభద్రకు వరద పోటెత్తుతున్న నేపథ్యంలో కౌతాలం ,కోసిగి, మంత్రాలయం మరియు నందవరం మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి రామానాయుడు వెల్లడించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల అధికారులను అప్రమత్తం గా ఉండాలని హెచ్చరించడం జరిగిందని మంత్రి రామానాయుడు పేర్కొన్నారు.
అధికార యంత్రాంగం అలెర్ట్
అత్యవసర సహాయంకోసం టోల్ ఫ్రీ 1070,112, 18004250101 సంప్రదించాలని సూచించారు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. అధికార యంత్రాంగాన్ని ఇప్పటికే అప్రమత్తం చేశామన్నారు. ఈ మండలాల ప్రజలు ఎవరూ కాలువలు, వాగులు దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు.












Click it and Unblock the Notifications