చంద్రబాబు దోపిడీలు , దొంగతనాలను మనవడు దేవాన్ష్ ప్రశ్నిస్తాడు ... విజయసాయి ఫైర్
టీటీడీ 1,381 కేజీల బంగారం పై తనదైన శైలిలో స్పందించారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి .టీటీడీ బంగారం ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా బయటకొచ్చిందని ప్రశ్నించారు విజయసాయి రెడ్డి. హైదరాబాద్ వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్నికల సందర్భంగా ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని తరలించవలసిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. చంద్రబాబు దోపిడీలు దొంగతనాలు మనవడు దేవాన్ష్ చూస్తున్నాడని, ఏదో ఒకరోజు మనవడే తాతను ప్రశ్నిస్తాడని ఫైర్ అయ్యారు విజయ సాయి.

చెత్త విషయాలపై స్పందించే బాబు టీటీడీ బంగారం విషయంలో స్పందించలేదన్న విజయసాయి
టీటీడీ బంగారం బయటకు రావటంపై పలు అనుమానాలను వ్యక్తం చేసిన విజయసాయి భారీ స్థాయిలో బంగారం తరలింపు జరుగుతున్నా టీటీడీ అధికారులెవ్వరూ ఎందుకు లేరని సందేహం వ్యక్తం చేశారు. చెన్నై నుంచి తిరుపతి వచ్చే సమయంలో సదరు వాహనం జాతీయ రహదారిపై నుంచి కాకుండా వేపంపట్టు అనే ప్రదేశానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ప్రశ్నించారు. పనికిరాని చెత్త విషయాలపై స్పందించే సీఎం చంద్రబాబు ఈ విషయంలో ఎందుకు స్పందించటం లేదని విజయసాయి ప్రశ్నించారు .

దేవుడి సొమ్ము దోపిడీ చేసేందుకే చంద్రబాబు పక్కా ప్లాన్
టీటీడీలో చంద్రబాబు చేసే దోపిడీలు బయటపడతాయనే ప్రధానార్చకులు రమణ దీక్షితులను తొలగించి.. ఆ తర్వాత మిగిలిన ముగ్గురు అర్చకులను కూడా ఇంటికి పంపించారన్నారు. ఉత్తర భారతదేశానికి చెందిన వ్యక్తిని టీటీడీ ఈవోగా నియమించారని, ఆ తర్వాత యనమల వియ్యంకుడిని ఛైర్మన్‌గా చేశారని ఎద్దేవా చేసిన విజయసాయి దేవుడి సొమ్మును దోపిడీ చేసేందుకే పక్కా ప్లాన్‌తో చంద్రబాబు వ్యవహరించారని మండిపడ్డారు.

మీ మనవడే మీ తప్పులను ప్రశ్నిస్తే మీ పరిస్థితి ఏంటి ? అన్న విజయసాయి
తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిపిన తవ్వకాలలో గోప్యత ఎందుకు పాటించారని, తవ్వకాల్లో బయటపడిన గుప్తనిధులు ఏమయ్యాయని విజయసాయి ప్రశ్నించారు. తిరుమల వ్యవహారంపై మరోమారు విజయసాయి అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఇక చంద్రబాబు చేస్తున్న తప్పులను మనవడు జాగ్రత్తగా గమనిస్తున్నాడని మనవడు ప్రశ్నిస్తే మీ పరిస్థితి ఏంటి అని విజయసాయి చంద్రబాబును ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications