తెలంగాణ కోసం ఓ అడుగు వెనక్కి..: చంద్రబాబు
హైదరాబాద్: తెలంగాణ కోసం తాను ఓ అడుగు వెనక్కి తగ్గడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ విషయాన్ని తాను గతంలో చెప్పానని, ఇప్పుడు కూడా చెబుతున్నానని ఆయన అన్నారు. శనివారంనాడు ఆయన ఎన్టీఆర్ భవన్‌లో తెలంగాణ టిడిపి సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. నిన్నటి వరకు తెలుగువాళ్లం కలిసి ఉన్నామని, ఇప్పుడు భౌగోళికంగా విడిపోయినా మానసికంగా కలిసి ఉండాలనేది తన కోరిక అని ఆయన అన్నారు.
ఏపీ సీఎంగా ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమిస్తున్నా, తెలంగాణ బాగును నేను విస్మరించనని ఆయన చెప్పారు. పొరుగు రాష్ట్రాలతో సన్నిహిత సంబంధాలు ఉండాలని తాను ప్రయత్నిస్తున్నానని, తెలంగాణతో మరింత బాగుండాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. విభజన తర్వాత విద్యుత్తు, కాలేజీలు, నీళ్లు వంటి అనేక అంశాలపై సమస్యలు వచ్చాయని, రెండు రాష్ట్రాలు కలిసి కూర్చుని ఒకటి రెండేళ్లలో వీటిని పరిష్కరించుకోవాలని ఆయన చెప్పారు. లేకపోతే కేంద్రం తన నిర్ణయం తాను తీసుకొని నోటిఫై చేస్తుందని చెప్పారు. అయినా సమస్య పరిష్కారం కాకపోతే కోర్టుకు వెళ్లాలని, దానివల్ల సమయం వృథా కావడం తప్ప ప్రయోజనం ఉండదని అన్నారు.

రాష్ట్రాన్ని విభజించే ముందే కేంద్రం ఇరు ప్రాంతాల వారిని కూర్చోబెట్టి మాట్లాడి ఉంటే ఇప్పుడు ఇన్ని సమస్యలు వచ్చేవి కావన్నారు. విభజనకు ముందు కాంగ్రెస్, విభజన తర్వాత టిఆర్ఎస్ తమ పార్టీని లక్ష్యంగా చేసుకుని వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఎన్ని లోపాలున్నా విభజన చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ఉల్లంఘించడం లేదని, ఏపీ తరఫున మాట్లాడేటప్పుడు ఎక్కడా తెలంగాణకు ఇచ్చినవి రద్దు చేయాలని గానీ ఆపాలనిగాని కోరలేదని ఆయన అన్నారు. ఏపీకి ఏం కావాలో మాత్రమే అడుగుతున్నామని, తెలంగాణలో టీఆర్‌ఎస్ నేతలు తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి ప్రతిరోజూ తనపై పడుతున్నారని ఆయన అన్నారు. తనకు ఏపీలో సమస్యలున్నాయని, తాను ఎవరిపైనా నెట్టడం లేదని చంద్రబాబు అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎంతో శ్రమపడి విద్యుత్తు సమస్యను పరిష్కరించుకొన్నానని, ఆ పని చేయలేని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో విద్యుత్తు సమస్యకు తనపై నిందలు వేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. తాను సీఎం సీట్లో కూర్చోగానే విద్యుత్తు పరిస్థితిని సమీక్షించి వచ్చే రెండేళ్లకు సరిపడా విద్యుత్తును ఎక్కడ లభ్యమైతే అక్కడ కొని పెట్టుకున్నానని అన్నారు. విద్యుత్తు విషయంలో తాను ఏ తప్పు చేయలేదని, తెలంగాణకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని,. ఆరు నెలలైనా ఇంకా తననూ తన పార్టీని విమర్శించే టీఆర్‌ఎస్ ప్రభుత్వం పొద్దు పుచ్చుతోందని బాబు విమర్శించారు. తెలంగాణలో 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని, దానిని ఏ శక్తీ ఆపలేదని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో టీడీపీ నోరు నొక్కడానికి ‘బ్లూస్టార్' ఆపరేషన్లు నిర్వహిస్తున్నారని, ఎన్ని చేసినా టీడీపీని ఎవరూ ఏమీ చేయలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications