విద్యుత్తు తెలంగాణకిచ్చి, రాయలసీమకు నీరు: చంద్రబాబు
కర్నూలు: అవసరమైతే జలవిద్యుత్తును తెలంగాణకు ఇచ్చి కృష్ణా నీటిని రాయలసీమకు తరలిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గోరకల్లు ప్రాజెక్టులో 5 టీఎంసీల నీరు ఉంచుతామని తెలిపారు. అవుకు రిజర్వాయర్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు.
పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీరు అందిస్తామంటే కొంత మంది అనవసరమైన రాజకీయం చేస్తున్నారని, దానిపై రాద్ధాంతం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు.
పట్టిసీమపై ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని ఆయన అన్నారు. రాయలసీమకు నీరిస్తున్నామని గోదావరి వాసులను రెచ్చగొడుతున్నారని, అడ్డుకోవాలని చూస్తే చరిత్ర వారిని క్షమించదని చంద్రబాబు ధ్వజమెత్తారు.

ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రాజెక్టును ఆపేదిలేదని చంద్రరు స్పష్టం చేశారు. నీచ రాజకీయాలతో గోదావరి ప్రాజెక్టుకు అడ్డుపడ్డారన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయని ఆయన తెలిపారు. గురువారం ఉదయం కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి అవుతాయని తెలిపారు. ప్రాజెక్టుల పనులు ఆలస్యం చేస్తే ఊరుకునేది లేదని, అనుకున్న సమయానికి ప్రాజెక్టులు పూర్తి కావాలని అన్నారు.
సమయానికి పూర్తిచేస్తేనే అనుకున్న బడ్జెట్ సరిపోతుందని చంద్రబాబు అన్నారు. కావాలని ఆలస్యం చేస్తూ వ్యయం పెంచుతున్నారని ఆయన అన్నారు. ఇక ముందు ప్రతిపనిని స్వయంగా పర్యవేక్షిస్తానని తెలిపారు.












Click it and Unblock the Notifications