బాబు వ్యూహాత్మక మౌనం: జగన్ కట్టడికి టిడిపి ఎదురుదాడి
హైదరాబాద్: నోటుకు ఓటు కేసు వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా మాట్లాడడం లేదని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తున్న చంద్రబాబు ప్రాజెక్టులపై, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలపై సభలు నిర్వహిస్తున్నారు. ఆ సభల్లో నోటుకు ఓటు వ్వహారంపై మాట్లాడడం లేదు.
మహాసంకల్ప సభలోనూ, ఆ తర్వాత ఢిల్లీ మీడియా సమావేశంలోనూ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుపై తీవ్రంగా ధ్వజమెత్తిన చంద్రబాబు ఆ తర్వాత మాట్లాడడం మానేశారు. మంత్రులతో సమావేశంలోనూ, మంత్రి వర్గ సమావేశంలోనూ ఆయన తెలంగాణ ప్రభుత్వంపై, కెసిఆర్‌పై మాట్లాడినట్లు వచ్చిన వార్తాకథనాలు మాత్రమే వచ్చాయి గానీ స్వయంగా ఆయన ముందుకు వచ్చిన మాట్లాడిన దాఖలాలు లేవు. వ్యూహాత్మకంగానే ఆయన మాట్లాడడం లేదని అంటున్నారు. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కూడా మాట్లాడడం లేదు.
వ్యూహాత్మకంగానే జగన్, కెసిఆర్‌లపై, నోటుకు ఓటు వ్యవహారంపై తాను స్వయంగా మాట్లాడకుండా తన మంత్రుల చేత, శాసనసభ్యుల చేత, పార్టీ నాయకుల చేత మాట్లాడిస్తూ ఎదురుదాడి చేయిస్తున్నట్లు చెబుతున్నారు. ఓటుకు నోటు వ్యవహారంపై ఢిల్లీ వెళ్లి చంద్రబాబుపై కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత మౌనం వహించారు. దీన్ని ఆసరాగా తీసుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు ఎదురుదాడికి దిగుతున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో వైయస్ జగన్మోహన్ రెడ్డి కుమ్మక్కయ్యారనే విషయాన్ని వారు ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్నారు. ఓటుకు నోటు కేసులో కేసీఆర్, జగన్ నాటకాన్ని త్వరలోనే బయటపెడతామని ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇరుక్కున్న కేసీఆర్ బయటపడేందుకు అధికారులను బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌లో ఇంకా తొమ్మిదేళ్లపాటు ఏపీ ప్రజలకు హక్కుందని, సెక్షన్-8 అమలు చేసి తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత గవర్నర్‌దేనని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు.
వైసీపీ అధినేత జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌ల మధ్య చీకటి ఒప్పందం జరిగిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెనాయుడు ఆరోపించారు. అసత్య ప్రసారాలతో టీడీపీని దెబ్బతీసేందుకు వారిద్దరూ కలిసి కుట్ర పన్నుతున్నారని ఆయన అన్నారు.
పథకం ప్రకారమే రేవంత్‌రెడ్డిని కేసులో ఇరికించారని రాష్ట్ర మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. తెలంగాణలో టీడీపీని దెబ్బ తీయాలని కుట్ర పన్నారన్నారు. జగన్, హరీష్, స్టీఫెన్ రహస్య ప్రదేశంలో సమావేశమై పథకం ప్రకారం కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు.
ఏపీలో అభివృద్ధిని అడ్డుకోవాలని చంద్రబాబును దెబ్బతీయాలని కుట్ర పన్నారని యనమల చెప్పారు.ఫోన్ ట్యాపింగ్ చేయడం రాజ్యాంగవిరుద్ధమన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు హోంమంత్రి, టీఆర్‌ఎస్ నేతల మాటలను బట్టే అర్ధమైంది. ఫోన్ ట్యాపింగ్‌పై తమ దగ్గర స్పష్టమైన ఆధారాలున్నాయని, టీఆర్‌ఎస్ మంత్రులంతా రాజీనామా చేయాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ నుంచి కేసీఆర్ తప్పించుకోలేడన్నారు.
నోటుకు ఓటు వ్యవహారాన్ని ఆసరా చేసుకుని వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా బలం పుంజుకోకుండా ఈ వ్యూహాన్ని తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఓ వైపు మంత్రులు, టిడిపి నేతలు, శానససభ్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఎదురు దాడికి దిగుతుంటే, చంద్రబాబు ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్తడం ద్వారా ప్రజల్లో ప్రతిష్టను కాపాడుకోవాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications