జగన్ సవాల్‌కు జవాబు: చంద్రబాబు టార్గెట్ 21 మంది ఎమ్మెల్యేలు?
విజయవాడ: తనకు మరో 21 మంది శానససభ్యుల మద్దతు ఉంటే ఇప్పటికిప్పుడు ప్రభుత్వాన్ని పడగొడతానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్న మాటలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపిస్తున్నారు.
జగన్ చెప్పిన సంఖ్యను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి లాగడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు వ్యూహాన్ని ఖరారు చేసినట్లు చెబుతున్నారు. 21 మంది ఎమ్మెల్యేలను వైసిపి నుంచి తమ పార్టీలోకి తీసుకుని రావాలనే పట్టుదలతో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు.
అందుకుగాను కార్యాచరణను పకడ్బందీగా రూపొందించినట్లు సమాచారం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొద్ది రోజుల కిందట ఎనిమిది మంది ఎమ్మెల్యేలు టిడిపిలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ తరువాత అసెంబ్లీ సమావేశాలు ఆరంభమయ్యాయి. ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించాలని జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో అది సాధ్యం అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

దీనికితోడు రోజా వ్యవహారం ముదిరి పాకాన పడింది. రోజా వివాదం పలు మలుపులు తీసుకుంటోంది. రోజా విషయంలో జగన్ అనుసరిస్తున్న వైఖరిపై శాసనసభ్యులు మాట్లాడే పరిస్థితిలో లేరు. రోజా వివాదం పార్టీకి నష్టం జరుగుతోందా, లాభం జరుగుతోందా అనే విషయాన్ని జగన్ కూడా తేల్చులేకపోతున్నారని అంటున్నారు.
మీ నాయకుడు సరిగా లేడు, మీరైనా మారండి, మా వైపు రండి అంటూ చంద్రబాబు సహా మంత్రులు శాసనసభలో పదే పదే అంటున్నారు. అలా కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. ఈ స్థితిలో అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని మొదలు పెట్టనున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలను టిడిపిలోకి తెచ్చే బాధ్యతులను ఇప్పటికే కొంతమంది నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.వచ్చే నెలలో మరో ఐదుగురు ఎమ్మెల్యేలను టిడిపిలోకి తీసుకువెళ్లడానికి వ్యూహాన్ని సిద్ధం చేశారు.
కొద్ది నెలల్లోనే తాము 21 మంది ఎమ్మెల్యేలను తీసుకువెళతామని, తమ లక్ష్యం పూర్తయిన తరువాత, ఆపార్టీ నుంచి ఎంతమంది వచ్చినా తమకు అభ్యంతరం లేదని టిడిపి వర్గాలంటున్నాయి.
ఇటీవల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి టిడిపిలోకి వెళ్లిన భూమా నాగిరెడ్డికి పార్టీలో సముచిత స్థానం ఇవ్వడం ద్వారా మిగతా శాసనసభ్యులను ఆకర్షించాలనే ఎత్తుగడలో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications