రేవంత్ రెడ్డి ఇష్యుపై చంద్రబాబు మనస్తాపం: నిద్రపట్టడం లేదని వ్యాఖ్య
విజయవాడ: తమ పార్టీ తెలంగాణ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి ఉదంతంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. మంగళవారం విజయవాడలో నవ నిర్మాణ దీక్షలో పాల్గొన్న అనంతరం ఆయన రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకున్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడు, అడిషనల్ డీజీపీ గౌతం సవాంగ్, పలు శాఖల ఉన్నతాధికారులతోపాటు, మంత్రులు దేవినేని ఉమా మహేశ్వర రావు, కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్‌లతో ఆయన సమావేశమాయ్యారు. ఈ సమయంలో చంద్రబాబు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు బుధవారం మీడియాలో వార్తలు వచ్చాయి.

విశ్వసనీయ సమాచారం మేరకు అంటూ కొన్ని పత్రికలు చంద్రబాబు చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలపై వార్తాకథనాలను ప్రచురించాయి. తాజా ఘటనలతో రెండు రోజులుగా నిద్రపట్టడం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు ఆ కథనాలు తెలియజేస్తున్నాయి. మానసికంగా కూడా ఇబ్బంది పడుతున్నానని చెప్పారు. రేవంత్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదాపడిన విషయాన్ని అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ఆ వార్తాకథనాల ప్రకారం - అంతకుముందు నవనిర్మాణ దీక్ష సందర్భంగా కూడా చంద్రబాబు తన ప్రసంగంలో రేవంత్ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. మంత్రులు, అధికారులతో జరిగిన సమావేశంలో మరిన్ని అంశాలూ ప్రస్తావనకు వచ్చాయి. సమైక్య ఉద్యమం జరిగిన తీరు, అప్పటి కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలి, పార్లమెంట్‌లో రాష్ట్ర విభజన బిల్లు చర్చకు వచ్చినప్పుడు తలుపులు వేసి, ప్రత్యక్షప్రసారాలు నిలపుదల చేసి బిల్లు ఆమోదించిన తీరుపై చర్చించుకున్నారు.












Click it and Unblock the Notifications