జనాభాపై మళ్లీ సీఎం, జగన్ గౌరవించారు కానీ: బొత్స వల్ల కాదన్న సుజయ
విజయవాడ/హైదరాబాద్: ఏపీలో జనాభా విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ప్రకటన చేశారు. రాష్ట్రంలో క్రమంగా జనాభా తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జపాన్ అతి తక్కువ జనాభాతో నానా ఇబ్బందులు పడుతోందని, ఆ దేశం పరిస్థితి మనకు వద్దన్నారు.
రాష్ట్రంలో జనాభాను పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు. పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబు విజయవాడలో సంచార చికిత్స సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రయివేటు ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలు అందించాలన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. సంపూర్ణ ఆరోగ్య సమాజాన్ని నిర్మించాలన్నదే తన లక్ష్యమన్నారు. సంచార వైద్య వాహనాలు గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తాయని తెలిపారు.
ప్రపంచంలో ఎక్కడికెళ్లినా భారతీయులు ఉంటారని, అమెరికాలో ప్రతి నలుగురు వైద్యుల్లో ఒకరు భారత్‌కు చెందిన వారేనన్నారు. నేటి నుంచి రాష్ట్రంలోని నాలుగు కేంద్రాల్లో ఉచిత సి.టి.స్కాన్ సౌకర్యం అందుబాటులో తీసుకొచ్చినట్లు తెలిపారు.

తొలిదశలో గుంటూరు, చీరాల, ప్రొద్దుటూరు, టెక్కలిలో సి.టి.స్కాన్‌లు ప్రారంభించామని, దశల వారీగా రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను ఉచితంగా అందిస్తామని చెప్పారు. ప్రజల వద్దకే వెళ్లి చికిత్స అందించే లక్ష్యంతో చేపట్టిన చంద్రన్న సంచార చికిత్స సేవలను ప్రారంభించామన్నారు.
జగన్ గౌరవించారు కానీ: సుజయ
వైసిపి అధినేత జగన్ తనను ఎంతో గౌరవించారని, అయితే వెనుకబడిన తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే టిడిపిలో చేరుతున్నానని సుజయ కృష్ణ రంగారావు చెప్పారు. కార్యకర్తలతో చర్చించిన తర్వాతే తాను టిడిపిలో చేరాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. వ్యక్తుల మధ్య బేధాభిప్రాయాలు సహజమేనని చెప్పారు. బొత్స సత్యనారాయణ వల్లే తాను టిడిపిలో చేరుతున్నట్లు వచ్చే వార్తలు సరికాదన్నారు.
చంద్రబాబు మార్గంలో లోకేష్: ఎల్ రమణ
ఏపీ సీఎం చంద్రబాబుకు విశ్వవిద్యాలయంలో చదివినప్పటి నుంచే రాజకీయాల్లో ఆసక్తి అని తెలంగాణ టిడిపి అధ్యక్షులు ఎల్ రమణ చెప్పారు. ఆయన అంచెలంచెలుగా ఎదిగారన్నారు. ముందుచూపుతో సైబరాబాద్ నిర్మించారని చెప్పారు. నారా లోకేష్ కూడా చంద్రబాబు మార్గంలో పయనిస్తున్నారని చెప్పారు. కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.
ఏపీకి రెండు యూనివర్సిటీలకు నిధులు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం రెండు విశ్వవిద్యాలయాలకు నిధులు ఇచ్చింది. రెండు వర్సిటీలకు నిధులు కేటాయిస్తూ బుధవారం నాడు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాజమండ్రిలో వ్యవసాయ విశ్వవిద్యాలయం, తిరుపతిలో తాత్కాలిక ఆలిండియా సైన్స్ రీసెర్చ్ సెంటర్‌లకు నిధులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కాగా, ఈ రోజు చంద్రబాబు పుట్టిన రోజు. ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు.












Click it and Unblock the Notifications