పందికోసం ఉచ్చు పెడితే చిరుత పులి పడింది-ఉలిక్కిపడ్డ గన్నవరం..!
ఏపీలో ఈ మధ్య పులుల సంచారం పెరుగుతుందన్న వార్తల నేపథ్యంలో కృష్ణాజిల్లా గన్నవరంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఓ రైతు తన పొలంలో పందుల కోసం పన్నని ఉచ్చులో ఏకంగా చిరుత పులి వచ్చి పడింది. అర్ధరాత్రి పొలంలోకి వచ్చిన చిరుత పులి ఈ ఉచ్చులో చిక్కుకుని చనిపోయింది. గన్నవరం రూరల్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనతో జిల్లాలో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఈ ఉదయం చిరుత పులి చనిపోయిందన్న వార్త దావానంలా వ్యాపించింది. గన్నవరం మండలం మెట్లపల్లి లో చిరుతపులుల సంచారంపై ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. అయితే గ్రామానికి చెందిన రైతు తన పంట పొలం రక్షించేందుకు పందులకు ఉచ్చు పెట్టగా అందులో చిరుత పులి చిక్కింది. రైతు ఉదయాన్నే పొలం వెళ్లి చూడగా ఉచ్చులో చిక్కి మృతి చెందినట్లు కనిపించింది. దీంతో రైతు ఆందోళనతో పొరుగున ఉన్న వారికి విషయం చెప్పాడు.

మెట్లపల్లిలో చిరుత రైతు పెట్టిన ఉచ్చులో చిక్కుకుని చనిపోయిందన్న వార్తతో గ్రామస్తులు, పరిసర ప్రాంత ప్రజలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అక్కడికి చేరుకుని చిరుతను కదిలించేందుకు ప్రయత్నించారు. కానీ అది కదలకపోవడంతో చనిపోయిందని నిర్దారించుకుని అధికారులకు సమాచారం అందించారు. మెట్లపల్లి చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో ఇంకా చిరుతపులులు ఉన్నాయేమో అన్న ఆందోళనలో చుట్టుపక్కల ప్రజలు ఉన్నారు. అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి పులుల సంచారంపై ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు.












Click it and Unblock the Notifications