చంద్రబాబు, పవన్ పై YS జగన్ 'బ్రహ్మాస్త్రం'!
వచ్చే ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. గెలుపు ఒక్కటే ప్రాతిపదిక కావాలని పార్టీ నేతలకు స్పష్టం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో విజయం సాధించడానికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలని సీఎం భావిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలుగా ఉన్న తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకునే అవకాశం ఉండటంతో వైసీపీ వైపు నుంచి ఓటింగ్ శాతం పెంచుకునే వ్యూహాన్ని జగన్ రచించారు.

లబ్ధిదారులను పలకరించి రావాలి..
ప్రభుత్వం నుంచి పథకాల రూపేణా నగదు అందుకుంటున్న లబ్ధిదారులు తమను గట్టెక్కిస్తారని వైసీపీ ఆశపడుతోంది. వివిధ సంక్షేమ పథకాలద్వారా బలహీనవర్గాల ప్రజలకు ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లోకి నగదు జమచేస్తోంది. వీరంతా రానున్న ఎన్నికల్లో వైసీపీకే ఓటేస్తారనే నమ్మకంతో జగన్ ఉన్నారు. అలాగే లబ్ధిదారులు టీడీపీ, జనసేనవైపు మళ్లకుండా ఉండేందుకు కొత్త వ్యూహాన్ని రూపొందించారు. ప్రతి కుటుంబాన్ని వాలంటీర్లతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పలకరించిరావాలి.. పథకాలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకోవాలి.

ఎటు గాలివీస్తే.. అటు మళ్లకుండా..!
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎన్నికల సమయానికి ఎటు గాలివీస్తే అటువైపు ప్రజలు మళ్లే అవకాశం ఉంది. అందుకు మరో వ్యూహాన్ని సిద్ధం చేశారు. ఒకవైపు అమరావతి రాజధాని అని తెలుగుదేశం చెబుతుండగా, మూడు ప్రాంతాల ప్రజలకు లబ్ధి కలిగేలా మూడు రాజధానులని వైసీపీ అంటోంది. దీనిద్వారా భావోద్వేగానికి గురైన ప్రజలు తమ పార్టీని ఆదరిస్తారని వైసీపీ పెద్దలు నమ్మకంతో ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నవారు కూడా మూడు ప్రాంతాల అభివృద్ధి అంటూ భావోద్వేగానికి గురైతే తమకు అనుకూలించే అంశంగా విశ్లేషిస్తున్నారు.
అంతిమంగా బీసీ కార్డుతో ఎదుర్కోవాలి!
ఈ రెండు కాకుండా ముందస్తుగా మరో ప్రణాళికను జగన్ సిద్ధం చేసుకున్నారు. అంతిమంగా బీసీ కార్డు ఉపయోగించాలనే వ్యూహంతో జగన్ ఉన్నారు. ఎన్నికల సమయానికి వ్యూహాలను మార్చుకునే అవకాశం ఉంటుందని కూడా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రజల మూడ్ ను గమనించి అవసరమైతే బీసీ కార్డును బయటకు తీయాలనుకుంటున్నారు. జనరల్ స్థానాల్లో కూడా బీసీలచేత పోటీచేయించే అవకాశం కనపడుతోంది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ఈ ప్రయోగం చేసి విజయవంతమైంది. అలాగే రానున్న ఎన్నికలకు కూడా ఇదే తరహా ప్రయోగం చేయాలని జగన్ నిర్ణయించారు. మొదటి రెండు కాకపోయినా బీసీ కార్డు అయినా కచ్చితంగా తనను గట్టెక్కిస్తుందనే నమ్మకంతో, విశ్వాసంతో ముఖ్యమంత్రి ఉన్నారు.












Click it and Unblock the Notifications