ఏపీ అసెంబ్లీ స్పీకర్.. యునానిమస్: వైసీపీ లేకుండా
Chintakayala Ayyannapatrudu: ఊహించినట్టే- ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా తెలుగుదేశం పార్టీకి చెందిన శాసన సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎన్నికయ్యారు. ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయింది. స్పీకర్ అయ్యన్నపాత్రుడు మినహా మరెవరూ నామినేషన్ పత్రాలను దాఖలు చేయలేదు.
అసెంబ్లీ స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రకటించారు. ఆ వెంటనే సభ్యులందరూ చప్పట్లు కొడుతూ, బల్లలు చరుస్తూ హర్షధ్వానాలను తెలియజేశారు. ఆయన వద్దకు వెళ్లి అభినందనలు తెలియజేశారు.

అనంతరం తెలుగుదేశం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్రశాఖ మాజీ అధ్యక్షుడు, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జనసేన నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, భారతీయ జనతా పార్టీ తరఫున వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్.. అయ్యన్నపాత్రుడును సగౌరవంగా స్పీకర్ స్థానం వరకు తీసుకెళ్లారు. ఆయనకు అభినందనలు తెలిపారు.
అసెంబ్లీలో అత్యంత సీనియర్ సభ్యుల్లో అయ్యన్నపాత్రుడు ఒకరు. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వివిధ శాఖలకు మంత్రిగా పని చేశారు. మొన్నటి ఎన్నికల్లో అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం నుంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. తన సమీప ప్రత్యర్థి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పెట్ల ఉమాశంకర్ గణేష్‌ను 24 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు.
1983, 1985, 1994, 1999, 2004, 2019, 2024 నర్సీపట్నం నుంచి అయ్యన్నపాత్రుడు ఏడు సార్లు గెలిచారు. ఆయనకు ఉన్న అపార రాజకీయ, సభా అనుభవాలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ- జనసేన- బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అయ్యన్నపాత్రుడిని స్పీకర్‌గా నామినేట్ చేసింది.
కాగా- స్పీకర్ ఎన్నిక సమయంలో సభలో వైఎస్ఆర్సీపీ సభ్యులు లేరు. నేటి సభా కార్యకలాపాలను వారు బహిష్కరించారు. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేసిన ఘటనకు నిరసనగా వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో విధ్వంసక పాలన ఆరంభమైందంటూ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications