పిఠాపురంకు చిరంజీవి, మెగా హీరోలు - ముహూర్తం ఫిక్స్..!!
తమ్ముడు కోసం అన్నయ్య రంగంలోకి దిగుతున్నారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న జనసేనానికి మద్దతుగా మెగా హీరోలు ప్రచారంలోకి వస్తున్నారు. పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో చిరంజీవి ప్రచారం చేస్తారని కొద్ది రోజులుగా చర్చ సాగుతోంది. ఇప్పుడు అధికారికం అయింది. ఇందుకు ముహూర్తం ఖరారు చేసారు. 2009లో చిరంజీవి తన ప్రజారాజ్యం అభ్యర్దిగా గెలిపించుకున్న వంగా గీతను నేడు ఓడించి..తన తమ్ముడిని గెలిపించాలని కోరేందుకు సిద్దమయ్యారు.
తమ్ముడు కోసం అన్నయ్య
పిఠాపురం నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలనేది పవన్ లక్ష్యం. తాజాగా పవన్ నామినేషన్ వేళ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. టీడీపీ నేత వర్మ అక్కడ పవన్ ప్రచార బాధ్యతలను స్వీకరించారు. జనసేన స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగారు. సామాజిక సమీకరణాల ప్రభావం పిఠాపురంలో ఈ సారి గెలుపు ఓటములను నిర్దేశించనుంది. పవన్ ఇప్పటికే రెండు సభలు నిర్వహించారు. పిఠాపురం పైన తన విజన్ ఏంటో వెల్లడించారు. ఇక, పవన్ పార్టీకి కొద్ది రోజుల క్రితం చిరంజీవి రూ 5 కోట్ల విరాళం ఇచ్చారు. ఆ తరువాత టీడీపీ కూటమి నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేష్, పెందుర్తి నుంచి పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ బాబుకు చిరంజీవి మద్దతు ప్రకటించారు.

పిఠాపురంలో ప్రచారం
వారిని గెలిపించాలని వీడియో సందేశం ఇచ్చారు. దీని పైన వైసీపీ నేతలు స్పందించారు. ఇక..ఇప్పుడు పవన్ పోటీ చేస్తున్న పిఠాపురంలో 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం విజయం సాధించింది. నాడు ప్రజారాజ్యం అభ్యర్దిగా వంగా గీత కోసం చిరంజీవి ప్రచారం చేసారు. కానీ, ఇప్పుడు వంగా గీత వైసీపీ అభ్యర్దిగా పవన్ పైన పోటీ చేస్తున్నారు. అదే పిఠాపురంలో ఇప్పుడు చిరంజీవి జనసేనాని కోసం ప్రచారానికి వస్తున్నారు. ఇందుకు మే 5వ తేదీ ముహూర్తంగా నిర్ణయించారు. చిరంజీవితో పాటుగా మెగా హీరో రాం చరణ్ వస్తున్నట్లు సమాచారం. తన బాబాయ్ కోసం తన తండ్రితో పాటుగా రాం చరణ్ పిఠాపురం వస్తున్నట్లు సమాచారం.

మే 5న పిఠాపురం లో
చిరంజీవి, నాగబాబు, రాం చరణ్ కలిసి మే 5వ తేదీన పిఠాపురం లో రోడ్ షోలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా కాలం తరువాత చిరంజీవి రాజకీయంగా ప్రచారానికి వస్తుండటంతో మెగా ఫ్యాన్స్ తో పాటుగా రాజకీయంగానూ ఆసక్తి కనిపిస్తోంది. చిరంజీవి తన ప్రచారంలో జగన్ ను టార్గెట్ చేస్తారా లేక కేవలం పవన్ ను గెలిపించమని కోరటం వరకే పరిమితం అవుతారా అనేది రాజకీయంగా ఉత్కంఠను పెంచుతోంది. అయితే, చిరంజీవిని అనకాపల్లిలోనూ ప్రచారం చేయాలని సీఎం రమేష్ కోరుతున్నారు. దీని పైన చిరంజీవి నిర్ణయం ఏంటనేది వెల్లడి కావాల్సి ఉంది. చిరంజీవి ప్రచారంలో అభిమానులతో పాటుగా జనసేన, బీజేపీ, టీడీపీ శ్రేణులు పాల్గొనేలా ఇప్పటికే సమాచారం ఇచ్చారు. దీంతో, దాదాపు పదేళ్ల తరువాత చిరంజీవి రాజకీయ పాత్ర పైన ఆసక్తి కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications