అమరావతి పిటిషన్ల విచారణకు సుప్రీం ఛీఫ్ జస్టిస్ నో- మరో బెంచ్ కు బదిలీ- షాకింగ్ రీజన్
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమరావతి స్ధానంలో మూడు రాజధానుల్ని అమల్లోకి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలకు హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ పిటిషన్లపై విచారణకు ఛీఫ్ జస్టిస్ యూయూ లలిత్ నిరాకరించారు. మరో బెంచ్ కు ఈ పిటిషన్లను బదిలీ చేస్తామని ప్రకటించారు.

అమరావతిపై సుప్రీంకోర్టు విచారణ
అమరావతిలో రాజధాని స్ధానంలో మూడు రాజధానుల్ని అమల్లోకి తెచ్చేలా గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తప్పుబడుతూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది.దీన్ని సవాల్ చేస్తూ వైసీపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.అలాగే ఈ పిటిషన్లపై సత్వర విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టును కోరింది. దీంతో ఇవాళ విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ ఆధ్వర్యంలోని సుప్రీం ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది.

సుప్రీం ఛీఫ్ జస్టిస్ కీలక నిర్ణయం
అమరావతి రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ మొదలుపెట్టిన సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ యూయూ లలిత్.. అనంతరం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ పిటిషన్లపై విచారణను తాను కొనసాగించడం సరికాదని ఆయన భావించారు. దీంతో ఆయన ఈ వ్యవహారంలో దాఖలైన 9 కేవియట్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను మరో బెంచ్ కు బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది.

పరస్పర భిన్నాభిప్రాయాలు వద్దనే బదిలీ ?
అయితే ఏపీ విభజన చట్టంపై గతంలో సుప్రీంకోర్టులో దాఖలైన కేసుల్ని సీజేఐ యూయూ లలిత్ విచారించి తీర్పులు ప్రకటించారు. ఇప్పుడు దాంతో సంబంధం ఉన్న అమరావతి అంశంపై పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో ఒకే న్యాయమూర్తి నుంచి భిన్నాభిప్రాయాలు వెలువడితే అనైతికం అవుతుందనే కారణంతో జస్టిస్ యూయూ లలిత్ ఈ పిటిషన్లను మరో బెంచ్ కు బదిలీ చేయాలని నిర్ణయించారు. ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైన తర్వాత పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఈ విషయాన్ని సీజే దృష్టికి తీసుకురావడంతో ఆయన విచారణ బదిలీ నిర్ణయం తీసుకున్నారు.

మరో బెంచ్ కు అమరావతి పిటిషన్లు
అమరావతి రాజధానిపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ యూయూ లలిత్ వీటిని మరో బెంచ్ కు బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో అమరావతి పిటిషన్లపై జస్టిస్ యూయూ లలిత్ బెంచ్ కు బదులుగా మరో కొత్త బెంచ్ విచారణ చేపట్టబోతోంది. అయితే ఇది ఎప్పుడన్నది మాత్రం తేలలేదు. మరోవైపు నవంబర్ 8న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్ రిటైర్ కాబోతున్నారు. ఆయన స్ధానంలో జస్టిస్ డీవై చంద్రచూడ్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. అనంతరం దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.












Click it and Unblock the Notifications