అన్నదాత సుఖీభవ ఇక వారికే, అప్పుడే - చంద్రబాబు ప్రకటన..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేసారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటితో ఎనిమిది నెలలు పూర్తయింది. ఈ ఏడాది లో ఇక రైతు భరోసా.. తల్లికి వందనం అమలు లేనట్లే. ఈ నెల 28న ప్రవేశ పెట్టే బడ్జెట్ లో 2025-26 కాలంలో అమలు దిశగా కేటాయింపులు చేస్తున్నారు. ఇదే సమయంలో అన్నదాత సుఖీభవ పథకం అమలు విషయంలో చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. ఒకే విడత కాకుండా అమలులో కొత్త మార్పులు తీసుకొస్తున్నారు.
అన్నదాత సుఖీభవ
సూపర్ సిక్స్ హామీల్లో రైతులకు ఇచ్చిన కీలక హామీ ప్రతీ ఏటా రూ 20 వేలు ఆర్దిక సాయం. జగన్ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా పేరుతో అమలు చేసిన ఈ పథకానికి కూటమి ప్రభుత్వం పేరు మార్పు చేసింది. అన్నదాత సుఖీభవ పేరుతో పథకం అమలుకు సిద్దమైంది. ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో ఈ పథకం అమలు కావటం లేదు. వచ్చే ఆర్దిక సంవత్సరంలో అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. పీఎం కిసాన్ పథకం కింద ప్రతీ ఏటా రైతులకు ఇచ్చే రూ 6 వేలకు రాష్ట్ర ప్రభుత్వం రూ 14 వేలు కలిపి రూ 20 వేలు చెప్పున అర్హులై న రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయం తీసుకుంది.

చంద్రబాబు ప్రకటన
అన్నదాత సుఖీభవ పథకం సైతం పీఎం కిసాన్ తరహాలోనే మూడు విడతలుగా అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కేంద్రం పీఎం కిసాన్ నిధులు విడుదల సమయంలోనే రాష్ట్ర ప్ర భుత్వం ఇవ్వాల్సిన 14 వేలను మూడు విడతలుగా ఆ నిధులతో పాటుగానే జమ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 14 వేలను మూడు వాయిదాలుగా ఖరారు చేసి.. ఒక్కో విడతలో ఎంత మేర నిధులు జమ చేసేదీ బడ్జెట్ ప్రసంగంలో స్పష్టత ఇవ్వనున్నారు. అయితే, కూటమి ప్రభుత్వం అయిదేళ్లు కాలంలో ఒక ఏడాది ఈ పథకం అమలు చేయటం లేదనే విషయం తాజా నిర్ణయంతో స్పష్టం అవుతోంది. మిగిలిన నాలుగేళ్ల కాలం ఈ పథకం అమలు కసరత్తు చేస్తున్నారు.
మూడు విడతలుగా
తాజాగా మంత్రులు - కార్యదర్శుల సమావేశంలో రైతుల అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ స్పష్టత ఇచ్చారు. అన్నదాత సుఖీభవ నిధులు మూడు విడతలుగా అమలు చేస్తామని ప్రకటించారు. అలాగే ఏప్రిల్‌లో మత్స్యకారులకు వేట నిషేధ కాలానికి సంబంధించిన రూ.20 వేల భృతి చెల్లించనున్నట్లు వెల్లడించారు. వీరితో పాటుగా పాటుగా యాదవ, కురబలకు గొర్రెలు, మేకలు పంపిణీ చేస్తామని చంద్రబాబు స్పష్టం చేసారు. ధాన్యం కొనుగోలు, మద్దతు ధరల అమలు విషయంలోనూ ఎక్కడా సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.












Click it and Unblock the Notifications