బీ అలర్ట్ - అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధులపై చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సీజనల్ వ్యాధుల విషయంలో ముందు నుంచే అధికారులు చర్యలు తీసుకోవాలని....ఇప్పుడు చర్యలకు దిగితే పూర్తి ఫలితాలు రావని సీఎం అన్నారు. ప్రజారోగ్యంపై వైద్య ఆరోగ్య, మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని నిర్దేశించారు. గత పాలనలో అమలు చేసిన ఉత్తమ విధానాలను కొనసాగించాని సూచించారు.
చంద్రబాబు సమీక్ష
సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకున్న చర్యలపై మూడు శాఖలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సమీక్ష చేసారు. వ్యాధుల నివారణకు తీసుకున్న చర్యలపై అధికారులు సిఎంకు వివరించారు. మలేరియా, డెంగ్యూ నివారణకు కార్యాచరణ అమలు చేస్తున్నామని....ఫీవర్ కేసులు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామని, హైరిస్క్ కేసులపై ప్రత్యేక ఫోకస్ పెట్టామని అధికారులు వివరించారు. డెంగ్యూ, చికెన్ గున్యాకు ర్యాపిడ్ టెస్ట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉందని అన్నారు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు రాష్ట్రంలో 60 డయారియా కేసులు నమోదయ్యాయని. ప్రస్తుతం 6 గ్రామాల్లో 35 డయేరియా యాక్టివ్ కేసులు ఉన్నాయని అన్నారు. ఈ సీజన్ లో 9 మంది డయేరియాతో చనిపోయారని వివరించారు.

తక్షణం చర్యలు చేపట్టండి
కలుషిత తాగునీరు వల్లే వీరంతా డయేరియా బారిన పడి చనిపోయారని అధికారులు వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ....గ్రామాలు, పట్టణాల్లో కలుషిత తాగునీరు, పారిశుధ్య లోపం, దోమల నివారణకు చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, వాటిపై ఇప్పటికే తగు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందని సీఎం అభిప్రాయపడ్డారు. సురక్షితమైన తాగునీరు, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో సీజనల్ వ్యాధుల బారిన పడే వారి సంఖ్య అధికంగా ఉంటుందని..వారిపై వైద్య, ఆరోగ్య శాఖ మరింత దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. కనీసం తాగునీటి పరీక్షలూ జరపడం లేదని సీఎం వ్యాఖ్యానించారు.
ఉపేక్షించేది లేదు
అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడితే మాత్రం ఉపేక్షించేది లేదని సీఎం హెచ్చరించారు. డెంగ్యూ వస్తే వైద్యానికి లక్షల్లో ఖర్చు అవ్వడంతో పాటు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని సిఎం పేర్కొన్నారు. సీజనల్ వ్యాధుల నివారణలో మూడు శాఖలు సమన్వయంతో పనిచేయాలని, అప్పుడే ఫలితాలు వస్తాయని సీఎం సూచించారు. మూడు శాఖల మంత్రులు, అధికారులు దీనిపై ప్రత్యేకంగా సమావేశం పెట్టుకుని కార్యాచరణతో ముందుకు వెళ్లాలని చంద్రబాబు ఆదేశించారు. పారిశుధ్య పనులు చేపట్టడం, నిరంతర ఫాగింగ్, సురక్షిత తాగునీరు అందిస్తే చాలా వరకు సీజనల్ వ్యాధుల సమస్య పరిష్కారం అవుతుందని సీఎం సూచించారు.












Click it and Unblock the Notifications