మంత్రులకు చంద్రబాబు ర్యాంకులు - పవన్, లోకేష్ స్థానాలు ఇవే..!!
ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నారు. అమరావతి తో పాటుగా పరిశ్రమలకు భూ కేటాయింపులు .. సంక్షేమ పథకాల అమలు పైన మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. జనవరి లో కొత్త రేషన్ కార్డుల మంజూరు పైన మంత్రివర్గంలో చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది. సంక్రాంతికి మహిళలకు ఉచిత బస్సు పథకం పైనా నిర్ణయం తీసుకోనున్నారు. ఇక, ఈ భేటీలో సీఎం చంద్రబాబుకు మంత్రులకు ర్యాంకులు.. ప్రోగ్రెస్ రిపోర్టులు ఇవ్వనున్నారు.
మంత్రుల ర్యాంకులు
ఏపీ మంత్రివర్గం ప్రతీ 15 రోజులకు ఒక సారి సమావేశం కావాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఈ నెలలో రెండో సమావేశం ఈ రోజు జరగనుంది. ఈ భేటీలో కూటమి ప్రభుత్వం ఆరు నెలల పాలన పైన సమీక్ష చేయనున్నారు. మంత్రుల ఆరు నెలల పని తీరు పైన ముఖ్యమంత్రి ర్యాంకులు ఖరారు చేసారు. మంత్రులుగా పని తీరు పైన నివేదికల ఆధారంగా వారికి మార్కులు ఇచ్చారు. ప్రస్తుత మంత్రివర్గంలో డిప్యూటీ సీఎం పవన్.. లోకేష్ పని తీరు సమర్ధవంతంగా ఉందని ముఖ్యమంత్రికి అందిన నివేదికల ఆధారంగా నిర్దారించారు.

మంత్రులకు హెచ్చరిక
అదే విధంగా మంత్రివర్గంలో మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవికుమార్, వైద్య - ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, కొండపల్లి శ్రీనివాస్ లు తమ శాఖల నిర్వహణలో ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. తొలి మూడు నెలల్లో హోం మంత్రి అనిత రెండో స్థానంలో ఉండగా.. గత రెండు నెలల కాలంలో వెనుకబడ్డారని తెలుస్తోంది. మంత్రివర్గంలోకి నాగబాబు చేరిక పైన ఈ సమావేశం లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. కొంతమంది మంత్రులపై ముఖ్యమంత్రి అసంతృప్తి తో ఉన్నారని..ఈ భేటీలో వారికి హెచ్చరిక చేసే అవకాశం ఉందని సమాచారం. ఆరు నెలల పాలన ముగియడంతో పని తీరు మెరుగుపర్చు కోవటం పైన సీఎం దిశా నిర్దేశం చేయనున్నారు.
అమరావతి పనులకు ఆమోదం
ఇక, ఈ భేటీలో సీఆర్డీఏ ఆధారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన రూ. 24,276 కోట్ల పనులకు మంత్రివర్గం ఆమోదం తెలియజేయనుంది. అలాగే వివిధ పరిశ్రమలకు భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. బుడమేరు ముంపుతో నష్టపోయిన బాధితులకు రుణాల రీ షెడ్యుల్ కోసం స్టాంపు డ్యూటీ మినహాయింపు ప్రతిపాదన మంత్రివర్గ సమావేశం ముందుకు రానుంది. కొత్త రేషన్ కార్డులు..జనవరి నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పథకం ప్రారంభం పైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణా .. తదనంతర పరిణామాల పైన మంత్రివర్గంలో చర్చించనున్నారు.












Click it and Unblock the Notifications