వెంకటేశ్వరుడి దయవల్లే మళ్లీ అవకాశం: జెండా ఆవిష్కరణలో చంద్రబాబు
గొప్ప వ్యక్తుల పుట్టకకు ఆంధ్రప్రదేశ్ నిలయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. 71వ స్వాతంత్య్రదిన వేడుకలు మంగళవారం ఉదయం తిరుపతిలో ఘనంగా జరుగుతున్నాయి.
తిరుపతి: గొప్ప వ్యక్తుల పుట్టకకు ఆంధ్రప్రదేశ్ నిలయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. 71వ స్వాతంత్య్రదిన వేడుకలు మంగళవారం ఉదయం తిరుపతిలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తారకరామ మైదానంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జాతీయజెండా ఆవిష్కరించారు.
అనంతరం వేడుకలు తిలకించేందుకు వచ్చిన ప్రజలను అభివాదం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పెద్దయెత్తున పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ ఏడాది తిరుపతిలో అధికారికంగా వేడుకలు నిర్వహించింది.

ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. జాతీయ పతాకానికి నాంది పలికిన పింగళి వెంకయ్య మనవాడేనని తెలిపారు. అల్లూరి సీతారామరాజును తలచుకుంటే ఇప్పటికీ ఆవేశం వస్తుందని అన్నారు. బ్రిటీష్ వారి గుండెల్లో ఆయన రైళ్లు పరిగెత్తించారని చంద్రబాబు గుర్తు చేశారు. ఎన్టీఆర్ సామాన్య కుటుంబంలో పుట్టి చరిత్ర సృష్టించారని అన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఒక్కో ఏడాది ఒక్కో జిల్లాలో జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ ఏడాది పుణ్యక్షేత్రమైన తిరుపతిలో జరుపుకుంటున్నామని చెప్పారు. చిత్తూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాయలసీమను రతనాల సీమ చేస్తామని అన్నారు. తిరుమల వెంకటేశ్వరుడి దయ వల్లే ప్రజలకు సేవ చేసే అవకాశం మళ్లీ తనకు లభించిందని చంద్రబాబు తెలిపారు.
రాష్ట్రంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు.
దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రూ. లక్షా50వేలు రుణమాఫీ చేశామని చెప్పారు.
రైతులను ఆదుకునేందుకే ఈ రుణమాఫీ చేశామని తెలిపారు. డ్వాక్రా రుణాలు రూ.10వేలు మాఫీ చేశామని తెలిపారు. పేదవాడికి అండగా ఉంటామని, అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు
రాష్ట్రంలోని మహిళలను వేధింపులకు గురిచేసేవారిని కఠినంగా శిక్షిస్తున్నామని తెలిపారు. మహిళలను వేధింపులకు గురిచేసే పోకిరీలను రెండు నిమిషాల్లో పట్టుకునే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ర్యాగింగ్ లేకుండా చేశామని చెప్పారు. హుధుద్ తర్వాత విశాఖను సుందరనగరంగా తయారు చేశామని చెప్పారు.
విభజన తర్వాత తెలంగాణతోపాటు మనం నీళ్లు పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఏపీకి పోలవరం ప్రాజెక్టు జీవనాడీ అని అన్నారు. పట్టిసీమతో ప్రస్తుతానికి పంటలకు నీరందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. టెక్నాలజీలో మన రాష్ట్రానికి తిరుగులేదని చెప్పారు.
స్వాతంత్య్ర సమరయోధులకు రూ.15వేలు పింఛను ఇస్తున్నామని తెలిపారు. నవ్యాంధ్రను దేశంలోనే నెం.1గా నిలిపే శక్తి మనకుందని చంద్రబాబు చెప్పారు. ప్రధాని మోడీ కూడా నవ భారత నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నారని చెప్పారు. 7ముంపు మండలాలను ఏపీలో కలపడం వల్లే పోలవరం ప్రాజెక్టుకు మార్గం సుగమమైందని చంద్రబాబు చెప్పారు.












Click it and Unblock the Notifications