ఏపీలో బంగారం గనులు.. రాయలసీమ నుంచి గగన గర్జన!
పుట్టపర్తి వేదికగా ఆంధ్రప్రదేశ్ రక్షణ రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA) ఆధ్వర్యంలోని ప్రతిష్టాత్మక 'అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్' (AMCA) ఇంటిగ్రేషన్ ఫ్లైట్ టెస్టింగ్ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఏపీని దేశానికే రక్షణ శక్తిగా అభివర్ణించడమే కాకుండా, రానున్న రోజుల్లో 'బంగారం' ఉత్పత్తిలోనూ రాష్ట్రం కీలక పాత్ర పోషించబోతోందని సంచలన ప్రకటన చేశారు.
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగానే కాకుండా సహజ వనరుల వినియోగంలోనూ దూసుకుపోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గతంలో బంగారం అంటే కేజీఎఫ్ (KGF) గుర్తుకు వచ్చేదని, కానీ ఇకపై జేజీఎఫ్ (JGF - జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్) గుర్తుకు వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలోని జొన్నగిరిలో ఈ ఏడాది 600 కేజీల బంగారం ఉత్పత్తి కానుందని, రెండో ఏడాది నాటికి అది 1500 కిలోలకు చేరుతుందని వివరించారు. భవిష్యత్తులో దేశంలోనే బంగారం ఉత్పత్తికి ఏపీ ప్రధాన చిరునామాగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు.

పుట్టపర్తి నుంచి గగన గర్జన: AMCA ప్రాజెక్టు ప్రాధాన్యత
దేశం గర్వించే వ్యూహాత్మక రక్షణ కేంద్రంగా పుట్టపర్తి రూపుదిద్దుకోబోతోందని సీఎం చంద్రబాబు అన్నారు. ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానాలను తయారు చేసే AMCA ప్రాజెక్టుతో 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్య సాధనలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. రూ.15 వేల కోట్లకు పైగా పెట్టుబడితో రానున్న ఈ ప్రాజెక్టు ద్వారా 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. కేవలం 36 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇచ్చి 'జెట్ స్పీడ్'తో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశామని ఆయన గుర్తు చేశారు.
రక్షణ శక్తిగా ఆంధ్రప్రదేశ్: నాలుగు దిక్కులా వ్యూహాత్మక కేంద్రాలు
ఏపీ భౌగోళికంగా దేశ రక్షణకు అండగా నిలుస్తోందని చంద్రబాబు వివరించారు. శ్రీహరికోట 'అంతరిక్ష శక్తి'గా, నాగాయలంక 'క్షిపణి శక్తి'గా, పుట్టపర్తి 'రక్షణ శక్తి'గా, విశాఖపట్నం 'నౌకాదళ శక్తి'గా దేశానికి రక్షణ కవచంలా మారుతాయని పేర్కొన్నారు. ఇటీవల యుద్ధాల్లో కీలకమైన డ్రోన్ టెక్నాలజీపై దృష్టి సారించామని, ఓర్వకల్లులో 'డ్రోన్ సిటీ'ని ఏర్పాటు చేసి దేశానికే డ్రోన్ హబ్‌గా మారుస్తామని తెలిపారు. 'ఆపరేషన్ సింధూర్'లో వాడిన డ్రోన్లు ఏపీలోనే తయారై, టెస్టింగ్ జరుపుకోవడం మన గర్వకారణమని ఆయన అన్నారు.
రాయలసీమ: రత్నాల సీమగా పునర్‌వైభవం
కరువు సీమగా మారిన రాయలసీమను మళ్లీ 'రత్నాల సీమ'గా మారుస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. లక్ష కోట్ల రూపాయలతో సీమను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తున్నామని, కడప స్టీల్ ప్లాంటును 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని వెల్లడించారు. కియా పరిశ్రమ ఇప్పటికే 18 లక్షల కార్లను తయారు చేసి 80 దేశాలకు ఎగుమతి చేస్తోందని, అదే స్ఫూర్తితో కొప్పర్తిని ఎలక్ట్రానిక్స్ హబ్‌గా, తిరుపతిని రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్లాంట్, స్పేస్ సిటీలతో అభివృద్ధి చేస్తామని వివరించారు.
అభివృద్ధిలో బుల్లెట్ స్పీడ్: యువతకు పిలుపు
గత పాలనలో జరిగిన విధ్వంసాన్ని తుడిచిపెట్టి, కేవలం 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని చంద్రబాబు తెలిపారు. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ వంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయని, చిప్ నుంచి షిప్ వరకు ఏపీలోనే తయారవ్వాలన్నది తన ఆకాంక్ష అని అన్నారు. అభివృద్ధిని బుల్లెట్ స్పీడ్‌తో తీసుకెళ్తున్నామని, యువత ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.
పొదుపు ఉద్యమం: 'నా దేశం - నా బాధ్యత'
ప్రధాని మోదీ పిలుపునిచ్చిన పొదుపు ఉద్యమానికి ఏపీ సారధ్యం వహించాలని సీఎం కోరారు. ఇంధనం, బంగారం కొనుగోలు వల్ల విదేశీ మారక నిల్వలు తగ్గిపోతున్నాయని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని సూచించారు. తానే స్వయంగా తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించుకున్నానని, 'వర్క్ ఫ్రమ్ హోమ్' వంటి ఏడు అంశాలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ..
దా చంద్రబాబు వంటి విజన్ ఉన్న నాయకుడిని తన రాజకీయ జీవితంలో చూడలేదని రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. ఏపీ అంటే 'అడ్వాన్స్‌డ్ ప్రదేశ్' అని, దేశానికే ఇది రోల్ మోడల్ అని కొనియాడారు. బెంగుళూరుకు సమీపంలో ఉన్న పుట్టపర్తి ప్రాంతాన్ని 'మిలటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్'గా మార్చాలని ఆయన సీఎంను కోరారు. AMCA ద్వారా తయారయ్యే మొదటి యుద్ధ విమానం పుట్టపర్తి నేల నుంచే టేకాఫ్ అవుతుందని స్పష్టం చేశారు. అలాగే భారత్ డైనమిక్స్ (BDL) ఆధ్వర్యంలో అండర్ వాటర్ టార్పెడోల తయారీతో సముద్ర రక్షణ బలోపేతం అవుతుందన్నారు. గతంలో రూ.600 కోట్లుగా ఉన్న ఆయుధ ఎగుమతులు నేడు రూ.40 వేల కోట్లకు చేరాయని, దేశం ఆయుధ దిగుమతిదారు నుంచి ఎగుమతిదారుగా మారుతోందని రాజ్‌నాథ్ సింగ్ వివరించారు.














Click it and Unblock the Notifications