తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకంపైన కీలక ప్రకటన చేసింది. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఒకటవ తరగతి నుండి 12వ తరగతి వరకు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు మరియు కళాశాలలలో చదువుతున్న విద్యార్థులకు ప్రతి సంవత్సరం 15 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. అర్హులైన విద్యార్థుల, తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలలో ఈ నిధులు నేరుగా జమ అవుతాయి.
తల్లికి వందనం నిధులపై కీలక అధికారిక ప్రకటన
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 15,000 జమ చేయగా, తాజాగా, నెల్లూరు జిల్లా వింజమూరు పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించిన 'తల్లికి వందనం' నిధులపై కీలక అధికారిక ప్రకటన చేశారు. ఈ సంవత్సరం జూన్ నెలలోనే అర్హుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

నిధుల విడుదలకు కసరత్తు చేస్తున్న తెలంగాణా సర్కార్
విద్యార్థుల చదువుకు ఆటంకం లేకుండా ఆర్థిక సాయం అందించడమే లక్ష్యంగా అందిస్తున్న ఈ పథకం జూన్ నెలలో విద్యార్థులకు అందనుంది. వేసవి సెలవుల అనంతరం జూన్ నెల ప్రారంభంలో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు తిరిగి తెరుచుకోనున్న నేపథ్యంలో, విద్యా సంవత్సరం ప్రారంభంలోనే 'తల్లికి వందనం' నిధులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది.
ఒక్కొక్కరికీ రూ.15,000 చొప్పున నిధులు
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ, వారందరికీ ఒక్కొక్కరికీ రూ.15,000 చొప్పున నిధులు అందనున్నాయి. ఒకవేళ విద్యార్థులకు తల్లిదండ్రులు లేనట్లయితే, వారి సంరక్షకుల బ్యాంక్ ఖాతాల్లో 'తల్లికి వందనం' నిధులు జమ చేయబడతాయి. దీని ద్వారా మరింత మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది.ఈ పథకం పొందాలంటే విద్యార్థులకు కచ్చితంగా 75 శాతం హాజరు ఉండాలనే నిబంధన ఉంది.
పిల్లల చదువు భారం పడకుండా ఆర్థిక సహాయం
అలాగే, విద్యార్థి తల్లి బ్యాంక్ ఖాతా ఆధార్ కార్డుతో అనుసంధానం చేయబడి ఉండాలి. మొత్తం రూ.15,000 ఆర్థిక సాయం నుంచి పాఠశాల లేదా కళాశాల నిర్వహణ ఖర్చుల కింద రూ.2,000 మినహాయించి, మిగిలిన రూ.13,000 అర్హుల ఖాతాల్లో నేరుగా జమ అవుతాయి. పిల్లల చదువు భారం తల్లిదండ్రులపై పడకుండా ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ 'తల్లికి వందనం' పథకాన్ని ప్రవేశపెట్టింది.
త్వరలోనే నిధులు తల్లుల ఖాతాలలో
గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇదే తరహా పథకాన్ని 'అమ్మ ఒడి' పేరుతో అమలు చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం ద్వారా నిధులను విడుదల చేయడానికి కసరత్తు చేస్తోంది. త్వరలోనే నిధులను ఇవ్వనుంది.












Click it and Unblock the Notifications