అసెంబ్లీలో కామినేని - బాలయ్య ఎపిసోడ్‌పై సీఎం చంద్రబాబు సీరియస్..!
అసెంబ్లీ వేదికగా టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు వ్యక్తిగత ఎజెండాలతో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ మేరకు కొందరు మంత్రుల దగ్గర ఆయన ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తీవ్రంగా మండిపడ్డారు. కామినేని శ్రీనివాస్, నందమూరి బాలకృష్ణ ఎపిసోడ్‌కు సంబంధించి సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో ఈ వ్యవహారం మరోసారి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.
కామినేని Vs బాలయ్య..
లా అండ్ ఆర్డర్ అంశంపై మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. చిరంజీవి చాలా గట్టిగా అడిగిన తరువాత జగన్ అపాయింట్‌మెంట్ ఇచ్చారని చెప్పారు. ఈ వ్యాఖ్యలను బాలకృష్ణ ఖండించారు. చిరంజీవి గట్టిగా మాట్లాడటం వల్లే జగన్ అపాయింట్‌మెంట్ ఇచ్చారన్నది పచ్చి అబద్ధమన్నారు. "సైకోని ఇండస్ట్రీ నుంచి కొందరు కలవడానికి వెళ్లినప్పుడు చిరంజీవి గట్టిగా అడిగితేనే జగన్ వచ్చారు అనడం అబద్ధం.. అలా ఎవ్వరూ అడగలేదు అని బాలకృష్ణ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగుతోంది. దీనిపై ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సైతం స్పందించి ప్రెస్ నోట్ సైతం రిలీజ్ చేశారు. వైసీపీ నేతలు, చిరంజీవి అభిమాన సంఘాలు సైతం తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

సీఎం సీరియస్..
అసలు సభ ఎలా జరుగుతోంది.. అనే అంశంపై దృష్టి పెట్టాలి కదా? అని చీఫ్ విప్‌తో పాటు మంత్రి పయ్యావుల కేశవ్‌ను సీఎం చంద్రబాబు నాయుడు అడిగినట్టు చెబుతున్నారు. సభలో ఎవరేం మాట్లాడారో అన్నీ నా దగ్గరున్నాయని.. సభలో ప్రతిపక్షం లేదు కానీ మీరే ప్రతిపక్షం కంటే దారుణంగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారట. మీరు తప్పులు చేసి.. వైసీపీ వాళ్లకు మళ్లీ అవకాశం ఇవ్వకండి అని ఎమ్మెల్యేలకు సీఎం గట్టిగా క్లాస్ తీసుకున్నారని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
అసెంబ్లీకి విధిగా రావాలి..
అలానే పార్టీ ఎమ్మెల్యేలకు క్రమశిక్షణ ముఖ్యమని, గీత దాటితే సహించబోనని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఎమ్మెల్యేలంతా విధిగా సభకు హాజరయ్యేలా చూడాలని చీఫ్ విప్ జీవీ ఆంజనేయుల్ని ఆదేశించారు. కొందరు సభకు రెండు గంటలు ఆలస్యంగా రావడం, మధ్యాహ్నం మూడు గంటలకే వెళ్లిపోవడంపైనా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేలు సభ మొదలవడానికి ఐదు నిమిషాలు ముందే ఉండాలని, సభ ముగిసిన తర్వాతే వెళ్లాలని ఆదేశించారు.
మరోవైపు ఒక సీఐ బదిలీ గురించి సుధీర్‌రెడ్డి సభలో ప్రభుత్వాన్ని తప్పుబడుతూ మాట్లాడటమేంటని చంద్రబాబు ప్రశ్నించారు. అధికార పార్టీ సభ్యులం అనుకుంటున్నారా? ప్రతిపక్ష సభ్యులం అనుకుంటున్నారా? ఎంతో సీనియారిటీ ఉన్న సభ్యులు కూడా పరిధులు దాటి వ్యవహరించడమేంటి?' అని సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు స్పష్టం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications