జెసి ఎఫెక్టా?: అధికారులపై పాత చంద్రబాబు కనిపిస్తున్నారు, మగాళ్లకు 'వంట' చురక
అమరావతి: అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పని చేయని అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తద్వారా పాత చంద్రబాబు మళ్లీ కనిపిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి మాట్లాడుతూ... చంద్రబాబు మెతక వైఖరి మార్చుకోవాలన్నారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు కష్టపడుతుంటే అధికారులు మొద్దు నిద్రలో జోగుతున్నారని జెసి ఇటీవల వ్యాఖ్యానించారు. పాత చంద్రబాబు రావాలని అభిప్రాయపడ్డారు. సమైక్య ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారుల పట్ల కఠినంగా వ్యవహరించేవారు.
పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అధికారుల విషయంలో కాస్త మెతక వైఖరితో ఉన్నారనే వాదనలు ఉన్నాయి. ఇప్పుడు నాటి చంద్రబాబు కనిపించడం లేదని జెసి కూడా అభిప్రాయపడ్డారు. ఆయన వ్యాఖ్యల ఫలితమో మరేమో కానీ చంద్రబాబు ఇటీవల పలుమార్లు అధికారులను హెచ్చరించారు.

రెండు రోజుల విజయనగరం జిల్లా పర్యటన సందర్భంగా సరైన లెక్కలు తీసుకురాని మహిళా రెవెన్యూ అధికారిని చంద్రబాబు నిలదీశారు. పని చేయకుంటే, ప్రమోషన్లు రావని వేదికపై నుంచి హెచ్చరికలు జారీ చేశారు.
తాజాగా నిన్న కృష్టా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చంద్రబాబు యువ ఐఏఎస్ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్టా జిల్లా జాయింట్ కలెక్టర్‌ను పేరు పెట్టి పిలిచి మరీ, పని చేయకుంటే వదిలేది లేదన్నారు.
కాగా, జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ... ఇంట్లో ఆడవాళ్లు పని నిమిత్తం బయటకు వెళ్లినప్పుడు మగవారే వంట చేయాలని, వంట ఎలా చేయాలో నేర్చుకోవాలని సూచించారు. తేలికగా వంట పని పూర్తయ్యేందుకు తాము చాలినంత వంట గ్యాస్‌ను సరఫరా చేస్తున్నామన్నారు.
అమెరికాకు వెళ్లిన మనవారు అక్కడ వంటలు కూడా చేసుకుంటారని, ఇక్కడ మాత్రం పెత్తనం చేయాలని అనుకుంటున్నారని చమత్కరించారు. ఇంట్లో వంట చేయడం తమకు ఇష్టం లేదని చెప్పేవారు ఎవరున్నారో చేతులు ఎత్తాలని చంద్రబాబు అడగ్గా... సభ నవ్వులతో నిండిపోయింది.












Click it and Unblock the Notifications