ఢిల్లీకి సీఎం జగన్ -కేసీఆర్ పర్యటనతో సడన్ గా : ఆ ఎంపీ అంశం తేల్చరా -ఢిల్లీలో నయా సమీకరణాలు..!!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ప్రధాని మోదీతో పాటుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసేందుకు నిర్ణయించారు. ఈ రోజు లేదా రేపు సీఎం జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు వారం రోజులుగా ఢిల్లీలో మకాం వేసారు. తెలంగాణ భవన్ శంకుస్థాపన కోసం ఢిల్లీ వెళ్లిన ఆయన వరుసగా ప్రధానితో సహా హోం మంత్రి అమిత్, కేంద్ర మంత్రులు గడ్కరీ, జలశక్తి మంత్రి షెకావత్ తో భేటీ అయ్యారు.

సీఎం జగన్ ఢిల్లీ టూర్ అజెండా..
ఏపీ-తెలంగాణ మధ్య నీటి వివాదాలు..తాజాగా కేంద్రం విడుదల చేసిన గజెట్ వ్యవహారాలతో పాటుగా తెలంగాణ అభ్యంతర రాల పైన కేసీఆర్ కేంద్ర జలశక్తి మంత్రితో సుదీర్ఘంగా చర్చించారు. దాదాపు గంటన్నార సేపు ఈ సమావేశం జరిగింది. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్తున్నారు. ఆయన ఇప్పటికే ప్రధాని మోదీతో పాటుగా హోం మంత్రి-జలశక్తి మంత్రుల అప్పాయింట్ మెంట్ కోరారు. జగన్ తన పర్యటనలో ప్రధానంగా రాష్ట్రంలోని పరిస్థితులతో పాటుగా కేంద్రం నుంచి సాయం కోరుతున్నారు. ఆర్దికంగా ఏపీలో ఉన్న పరిస్థితులను వివరిస్తూ..కేంద్రం నుంచి ఉపశమన చర్యలను ఆశిస్తున్నారు.

కేంద్రం నుంచి ఆశించిన సహకారం లేదంటూ..
దీని పైన ప్రధానితో నేరుగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా హోం మంత్రి అమిత్ షా తో ఏపీ రాజకీయ అంశాల పైన జగన్ చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి తాము పూర్తిగా సహకారం అందిస్తున్నా.. తాము కోరుతున్న అంశాల విషయంలో మాత్రం కేంద్రం అదే స్థాయిలో స్పందించటం లేదనే అభిప్రాయం వైసీపీ నేతల్లో ఉంది. ఇదే అంశం పైన ఈ సారి అమిత్ షా తో భేటీ సమయంలో జగన్ చర్చిస్తారని సమాచారం. ఇక, పార్టీ ఎంపీ రఘురామ రాజు విషయంలో చర్యల పైనా చర్చకు వచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.

ఆ ఎంపీ వెనుక బీజేపీ...చర్యలు తీసుకోరా
వైసీపీ ఫిర్యాదుతో రఘురామ కు స్పీకర్ కార్యాలయం నోటీసులు ఇచ్చింది. సమాధానంకు ఇచ్చిన సమయం ముగిసి నెల రోజులు అవుతోంది. ఆయన పైన చర్యలు తీసుకోకుండా..బీజేపీ పరోక్షంగా సహకారం అందిస్తోందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా.. రాజకీయ అంశాల్లో దీనిని సైతం ప్రస్తావించే ఛాన్స్ ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక, జాతీయ స్థాయిలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. త్వరలో జరగనున్న రాష్ట్రపతి..ఉప రాష్ట్రపతి ఎన్నికలు కేంద్రానికి ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి.

ఢిల్లీలో బీజేపీ తెలుగు సీఎంల మద్దతు అవసరం..
ఈ ఎన్నికల్లో గతం లో టీఆర్ఎస్ - వైసీపీ రెండు పార్టీలు బీజేపీ నిర్ణయానికి..వారు ప్రతిపాదించిన అభ్యర్ధులకు మద్దతు ప్రకటించాయి. ఇప్పుడు సైతం అదే విధంగా ఈ రెండు పార్టీల మద్దతు బీజేపీకి అవసరం. ఈ రెండు పార్టీలు సైతం ఇచ్చి పుచ్చుకొనే ధోరణిలో భాగంగా.. తమకు సహకారం అందిస్తే...రాజకీయంగా మద్దతివ్వటానికి సిద్దంగా ఉన్నామనే సంకేతాలు ఇస్తున్నట్లు ఢిల్లీలో చర్చ సాగుతోంది. ఇక, రాజ్యసభలోనూ జగన్ పార్టీ బలం ప్రస్తుతం ఉన్న ఆరు స్థానాల నుంచి త్వరలో మరో నాలుగు స్థానాలతో చేరి పదికి చేరనుంది. పెద్దల సభలో వైసీపీ-టీఆర్ఎస్ బలం బీజేపీకి కీలకంగా మారుతోంది.

కేసీఆర్ ఏం చెప్పారు..,జగన్ ఏం చెబుతారు
బీజేపీ తీసుకురావాలని భావిస్తున్న కీలక బిల్లుల విషయంలోనూ మద్దతు అవసరం . దీంతో..ఈ రెండు పార్టీలతోనూ బీజేపీ మంచి సంబంధాలే కోరుకుంటోంది. ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం పైన గతంలోనే కేంద్ర మంత్రి షెకావత్ తో జగన్ చర్చించి తన వాదన వినిపించారు. ఇప్పుడు కేసీఆర్ సైతం సుదీర్ఘంగా కేంద్ర మంత్రికి తన అభ్యంతరాలను వివరించారు. ఇప్పుడు సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో వివాదాల అంశం తో పాటుగా పోలవరం అంచనాల పెంపు..నిధుల విషయం పైన చర్చించనున్నారు.
Recommended Video

మూడు రాజధానులపైనా..దసరా ముహూర్తం
ఇక, కీలకమైన మూడు రాజధానుల విషయం పైన ముందడుగు వేయటానికి దసరా ను జగన్ ముహూర్తంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. దసరా నాడు విశాఖలో క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు సీఎం జగన యోచిస్తున్నట్లుగా సమాచారం. ఈ అంశం పైన కేంద్రానికి క్లారిటీ ఇచ్చి..ఇక, రాజకీయంగా ముందుకు వెళ్లాలని సీఎం జగన్ ఆలోచనగా చెబుతున్నారు. దీంతో..సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఈ సారి రాజకీయంగా ఆసక్తికి కారణమవుతోంది.












Click it and Unblock the Notifications