నేడు - రేపు సీఎం జగన్ జిల్లాల్లో : ప్టాంట్ ప్రారంభం - పధకం ఆరంభం : అక్కడి నుంచే టీడీపీకి..!!
ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు - రేపు జిల్లాల్లో పర్యటించున్నారు. ఈ రోజు పర్యటనలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాబిక్కవోలు మండలం బలభద్రపురంలో బిర్లా గ్రూప్ కాస్టిక్ సోడా యూనిట్ ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా హాజరు కానున్నారు. మంగళం బిర్లాతో కలిసి గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కాస్టిక్ సోడా ప్లాంట్‌ను సందర్శిస్తారు. ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం 12.40 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు. ఇక, రేపు (శుక్రవారం) సీఎం జగన్ ఒంగోలులో పర్యటించనున్నారు.
ఉదయం 11 గంటలకు రంగారాయుడు చెరువు వద్ద ఉన్న పీవీఆర్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల వేదికగా వైఎస్సార్ సున్నా వడ్డీ మూడో విడత కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2021-22 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ ల్యాప్‌టాప్‌లో బటన్ నొక్కటం ద్వారా నేరుగా డ్వాక్రా గ్రూపుల బ్యాంకు అకౌంట్లకు జమ చేయనున్నారు. సభా స్థలి నుంచి కొత్తపట్నం బస్టాండ్ సెంటర్‌లోని బందర్ రోడ్డులో ఉన్న రవిప్రియ మాల్ అధినేత కంది రవి శంకర్ నివాసానికి మధ్యాహ్నం 12.30 గంటలకు చేరుకుంటారు.

అక్కడ రవి శంకర్ కుటుంబంలో ఇటీవల వివాహం అయిన నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అయితే, ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రతిపక్ష నేత..టీడీపీ అధినేత చంద్రబాబు తన జన్మదిన వేడుకల్లో భాగంగా సీఎం జగన్ పైన తీవ్ర విమర్శలు చేసారు. తండ్రి హయాంలోనే వేల కోట్ల అవినీతి పాల్పడ్డారంటూ విమర్శలు చేసారు. రేషన్ కార్డులు తొలిగిస్తారని.. ఏపీ పరిస్థితిని వివరిస్తూ శ్రీలంక ప్రస్తావన చేసారు. అదే విధంగా.. కేబినెట్ విస్తరణ... పదవుల కేటాయింపు వంటి అంశాల పైన రెండు రోజులుగా చంద్రబాబు ఆరోపణలు గుప్పించారు. వీటికి సీఎం జగన్ ఈ జిల్లాల పర్యటనల్లో సమాధానం చెబుతారని పార్టీ నేతల సమాచారం.
ప్రధానంగా బిర్లా గ్రూప్ కాస్టిక్ సోడా యూనిట్ ప్రారంభోత్సవం తరువాత సీఎం జగన్ రాష్ట్రంలో పరిశ్రమల గురించి మాట్లాడనున్నారు. అదే విధంగా ఒంగోలు పర్యటనలో రాజకీయ విమర్శలకు సమాధానం చెప్పనున్నారు. అటు చంద్రబాబు జిల్లాల పర్యటనలకు సిద్దం అవుతున్నారు. మహానాడు తరువాత నెలకు రెండు జిల్లాల చొప్పున పర్యటించనున్నారు. ఇటు సీఎం జగన్..సైతం ఇక ప్రజల్లోనే ఎక్కువగా ఉండాలని డిసైడ్ అయ్యారు. అయితే, ఒంగోలులో సీఎం పర్యటన కోసం వాహనాలను సమీకరిస్తున్నారంటూ వస్తున్న ఆరోపణల పైన ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అటువంటివి సహించేది లేదని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications