గవర్నర్ తో సీఎం జగన్ భేటీ - కీలక అంశాలపై చర్చ..!!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ - భారతి దంపతులు గవర్నర్ దంపతులతో సమావేశమయ్యారు. దాదాపు అరగంటకు పైగా వారి మధ్య సమావేశం జరిగింది. ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులను గవర్నర్ కు జగన్ వివరించారు. మార్చి 7వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని దాదాపుగా నిర్ణయించారు. అదే రోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. దీని పైన ముఖ్యమంత్రి గవర్నర్ దృష్టికి తీసుకువచ్చి అనుమతి తీసుకున్నారు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాలని గవర్నర్‌ను ఆహ్వానించారు.
మరో వైపు ప్రభుత్వం జిల్లాల పునర్ విభజన చేపట్టనుండగా ఆవిషయాన్ని కూడా సీఎం.. బిశ్వ భూషణ్‌కు వివరించారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా జిల్లాల పునర్ విభజన జరుగుతుందని, ప్రజల నుండి వినతులను స్వీకరించి ఆమోద యోగ్యమైన రీతిలో నూతన జిల్లాలను ఆవిష్కరించనున్నామని సీఎం వివరించారు. కొన్ని జిల్లాల విషయంలో అభ్యంతరాలు వస్తున్నా..వాటిని పరిష్కరించే దిశగా కసరత్తు జరుగుతోందని సీఎం వివరించినట్లుగా తెలుస్తోంది. తాజాగా కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో ఏపీ - తెలంగాణ మధ్య పునర్విభజన చట్టం లోని పెండింగ్ అంశాల పైన జరిగిన చర్చల సారాంశాన్ని సీఎం వివరించినట్లుగా సమాచారం.

ఇక, మంత్రి మేకపాటి హఠాన్మరణం .. ఏం జరిగిందనే దాని పైన సీఎం గవర్నర్ కు వివరించినట్లుగా తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మార్చి 8న గౌతమ్‌రెడ్డి మృతిపై సభ సంతాపం తెలపనుంది. మార్చి 11న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఏపీలో మంత్రివర్గ విస్తరణ పైన చర్చ జరుగుతున్న వేళ...ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత కేబినెట్ విస్తరణ చేపడతారని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ సమావేశాల్లోనే మూడు రాజధానుల బిల్లులు ప్రవేశ పెడతారనే వాదన వినిపిస్తున్నా..దీని పైన అధికారిక సమాచారం రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications