జగన్ 151 ప్లస్, ధీమా వెనుక - టీడీపీ క్యాంపు తేల్చిందేంటి..!!
ఏపీలో ఎన్నికల ఫలితాలపై అంచనాలు మొదలయ్యాయి. వైసీపీ, కూటమి గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి జగన్ 2019 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తున్నామంటూ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు కారణమవుతున్నాయి. జగన్ కేడర్ లో విశ్వాసం నింపేందుకే ఇలా చెప్పారా..నిజంగా నమ్మకంతో చెప్పారా అనేది ఇప్పుడు డిబేట్ గా మారింది. ఇదే సమయంలో టీడీపీ క్యాంపులోనూ కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.
జగన్ వ్యాఖ్యలతో
ముఖ్యమంత్రి జగన్ తాము తిరిగి అధికారంలోకి వస్తున్నామని ధీమాగా చెప్పారు. 2019లో గెలిచిన 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ సీట్ల కంటే ఎక్కువ సంఖ్యలో గెలుస్తున్నామని చెప్పుకొచ్చారు. పోలింగ్ ట్రెండ్స్ చూసిన సమయంలో ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వేయటం..ప్రభుత్వం పైన వ్యతిరేకత..భారీ పోలింగ్ శాతం తో ఖచ్చితంగా కూటమికి అనుకూల వాతావరణం ఉందనే లెక్కలు చర్చకు కారణం అయ్యాయి. వైసీపీలోనూ మహిళా, గ్రామీణ ఓటింగ్ తో తిరిగి తాము అధికారంలోకి వస్తున్నామనే నమ్మకం పెరిగింది. కానీ, రెండు పార్టీల నుంచి గెలుపు - సీట్ల లెక్కల పైన స్పష్టత రాలేదు. పైకి గెలుస్తున్నామని చెబుతున్నా..లోలోపల టెన్షన్ కొనసాగుతోంది.

జగన్ ధీమా వెనుక
ఇదే సమయంలో జగన్ 151 సీట్లకు పైగా గెలుస్తామని చెప్పటం ద్వారా మరో ఉత్కంఠ కు కారణమయ్యారు. అయితే, జగన్ తన కేడర్ లో విశ్వాసం నింపేదుకే ఇలా చెప్పారనే అభిప్రాయం తెర మీదకు వచ్చింది. కానీ, జగన్ ఇతర పార్టీల నేతల తరహాలో వ్యాఖ్యలు చేయటం...ప్రచారం కోసం మాట్లాడటం చేయరనేది వైసీపీ ముఖ్యుల వాదన. జగన్ ఏ మాట అయినా ఆచి తూచి స్పందిస్తారని..జగన్ చెబితే అది నిజం అనే నమ్మకం ఉందని చెబుతున్నారు. అదే సమయంలో హోరా హోరీగా ఇలా ఏకపక్షంగా సీట్లు సాధించటం సాధ్యమేనా అనే వాదన వినిపిస్తోంది. జగన్ తాను నమ్ముకున్న సామాజిక సమీకరణాలు..మహిళా ఓటింగ్ ద్వారా జరిగిన పోలింగ్ లెక్కలను పరిగణలోకి తీసుకున్న తరువాతనే తన అంచనాలను ప్రకటించారనేది పార్టీ నేతల సమాచారం.

టీడీపీ లెక్కలేంటి
ఇటు టీడీపీ క్యాంపు నుంచి పూర్తి మౌనం కనిపిస్తోంది. ఇది వ్యూహాత్మకమా...కాదా అనేది తేలాల్సి ఉంది. జగన్ ఏకపక్షంగా ఫలితాలు వస్తున్నాయని చెప్పిన తరువాత టీడీపీలో ఓక స్థాయి నేతలు ఎవరూ దీనికి కౌంటర్ చేయలేదు. కనీసం సోషల్ మీడియాలో పోస్టింగ్స్ కనిపించలేదు. ముఖ్య నేతలు మౌనంగా ఉంటున్నారు. జగన్ ఏం చేసినా..ఏం మాట్లాడినా విరుచుకుపడే టీడీపీ కోర్ టీం సైలెంట్ గా ఉంది. గెలుపు పైన జగన్ అంత విశ్వాసంతో కనిపిస్తుంటే..టీడీపీ స్పందించకపోవటం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అటు జనసేన నుంచి జగన్ కామెంట్స్ పైన స్పందన లేదు. పోటీ చేసిన అభ్యర్దులకు తమ ఫలితం ఏంటనేది మరింత టెన్షన్ పెంచుతోంది. దీంతో...జూన్ 4న వెల్లడయ్యే ఫలితం పైన ఉత్కంఠ పెరుగుతోంది.












Click it and Unblock the Notifications