హైదరాబాదులోనే ఉన్నా: సాక్షి, టీ న్యూస్ చానెళ్లపై సిఎం మండిపాటు
హైదరాబాద్: ఓటుకు నోటు కేసు వ్యవహారంలో తన పేరు ముందుకు రావడంతో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు సిఎం రమేష్ తీవ్రంగా ప్రతిస్పందించారు. సాక్షి, టీ న్యూస్ చానెళ్లపై ఆయన మండిపడ్డారు. తాను హైదరాబాదులోనే ఉన్నానని ఆయన చెప్పారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఇది అసలు దర్యాప్తే కాదని ఆయన అన్నారు.
ఇప్పటి వరకు ఏ విధమైన పరిణాలు చోటు చేసుకోలేదని, వస్తున్నవన్నీ వదంతులు మాత్రమేనని ఆయన అన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో సెటిలర్లను భయబ్రాంతులకు గురి చేసి విజయం సాధించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అనుకుంటోందని విమర్శించారు.
అసలు తన వద్దకు ఎందుకు వస్తున్నారని, నేరుగా వెళ్లి ఎసిబినే అడగాలని ఆయన మీడియాను ఉద్దేశించి అన్నారు. ఇలా లీకులు ఎందుకు ఇస్తున్నారని ఎసిబినే అడగాలని ఆయన సూచించారు. ఒక నిర్మాణ సంస్థ టిడిపి కార్యాలయానికి దగ్గరలోనే ఉందని, వాళ్ల బ్యాంకు ఖాతాల నుంచే డబ్బులు వెళ్లాయని అంటున్నారని, కానీ ఇది కనుక్కోవాలంటే రాకెట్ సైన్స్‌లా పరిశోధించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఎసిబి వాళ్లు బ్యాంకుకు వెళ్లి అడిగితే అధికారులు తప్పకుండా సమాచారం ఇవ్వాలని ఆయన అన్నారు.

స్టీఫెన్‌సన్ ఇచ్చిన ఫిర్యాదు ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందని, కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేతుల్లో ఉందనే సాకుతో ఎసిబికి అప్పగించిందని అన్నారు. ఆసలు ఈ కేసుతో తమ పార్టీకి సంబంధం లేదని ఆయన అన్నారు. తమ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారో లేదో స్పష్టంగా చెప్పాలని, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎసిబి నుంచి ఇదుగో అదుగో అంటే అందరూ పెరుగెడుతున్నారు తప్ప మీడియా కూడా ఎసిబి వర్గాలను ఎందుకు అడగడం లేదని ఆయన ప్రశ్నించారు. కేసులో రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు కదా అని మీడియా ప్రతినిధులు ప్రస్తావిస్తే అవన్నీ ఎమ్మెల్యే బయటకు వచ్చిన తర్వాతే తెలుస్తాయని ఆయన అన్నారు.
మైండ్ గేమ్ ఆడుతున్నారని, తప్పుడు పనులు చేసి ఉంటే స్పష్టంగా చెప్పాలని ఆయన అన్నారు. సాక్షి, టీ న్యూస్ చానెళ్లకు లీకులు ఎలా వచ్చాయని ఆయన అడిగారు. తాను కంగారు పడడం లేదని, హెచ్చరిక చేస్తున్నానని ఆయన అన్నారు.
ధనలక్ష్మి బ్యాంకులో తనకు ఖాతా లేదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాదులో ఎపి పోలీసులు ఉంటే తప్పేమిటని ఆయన అడిగారు. తాము అన్నింటికీ సిద్ధపడి ఉన్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications