బెజవాడ: బాబు క్యాంప్ ఆఫీస్‌లో హైటెక్ ఫెసిలిటీస్
విజయవాడ: అమరావతిలో రాష్ట్ర రాజధాని నిర్మాణానికి జూన్ ఆరో తేదీన శంకుస్థాపన, మంత్రుల కార్యాలయాలు తరలింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేయడంతో అధికార యంత్రాంగంలో కదలిక మొదలైంది.
విజయవాడ - గుంటూరు మధ్య వివిధ మంత్రిత్వ శాఖల ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేసి వారంలో మూడు రోజులపాటు విజయవాడ నుంచే ముఖ్యమంత్రి పరిపాలన సాగించటానికి రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
విజయవాడ ఐదో నెంబర్ బస్ రూట్‌లోని నీటిపారుదల శాఖలో అధునాతన భవనాలతో కూడిన ప్రత్యేక బ్లాక్‌లో ఏర్పాటు చేయదలచిన ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసుకు తుదిమెరుగులు దిద్దుతున్నారు.
సీఎం ఇక్కడ నుంచే వారంలో మూడు రోజుల పాటు పరిపాలన చేయనుండటంతో ఆఫీసు పరిసరాల్లోని రైతుబజార్, పోలీస్ కమిషనర్ కార్యాలయం, నీటిపారుదల శాఖ జిల్లా కార్యాలయం, ఎగ్జిబిషన్ గ్రౌండ్ భద్రత ఏర్పాట్లను పటిష్టం చేశారు. సీఎం సెక్యూరిటీ వింగ్ ఇప్పటికే నగరానికి తరలివచ్చింది.
వారి కోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ప్రత్యేక కార్యాలయాన్ని సిద్ధం చేశారు. మూడు బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలతో కలిపి కాన్వాయ్ ఏర్పాటు చేశారు. అత్యాధునిక జామర్లు సిద్ధం చేశారు. అలాగే పటమట ప్రాంతంలో అన్ని హంగులు కల్గిన అద్దె నివాస భవనం కోసం వెతుకుతున్నారు.
సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముఖ్యమంత్రి నివాసాన్ని ఎంపిక చేయనున్నారు. ఆయన ఇంటి నుంచి క్యాంప్ కార్యాలయానికి బయలుదేరే సమయంలోను, ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాలని కూడా పోలీసులు భావిస్తున్నారు. సీఎం తరచుగా ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం, ప్రభుత్వ హెలికాప్టర్‌ను కూడా గన్నవరం విమానాశ్రయంలోనే ఉంచాలని భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా వివిధ ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యాలయాలు, ప్రధానంగా సీఎంకు అందుబాటులో ఉంచాల్సిన హోం, రెవెన్యూ, ప్రణాళిక, వ్యవసాయ, పురపాలక, నీటిపారుదల ఇతర కీలక శాఖల కార్యాలయాలను సీఎం క్యాంప్ కార్యాలయానికి సమీపంలో ఉండేలా సబ్ కలెక్టరేట్ ఎదుట లైలా కాంప్లెక్స్‌ను పరిశీలిస్తున్నారు.
కాగా, చంద్రబాబు క్యాంపాఫీస్ హైటెక్ ఫెసిలిటీస్‌తో ఉండనుంది. చీఫ్ మినిస్టర్ ఛాంబర్, కేబినెట్ మీటింగ్ హాల్, డైనింగ్ రూమ్, విశ్రాంతి గదులు, వీపీపీ నిరీక్షణ గదులు, సెక్యూరిటీ బ్లాక్ తదితరాలు ఉండనున్నాయి.

రాజధానిపై బాబు పట్టు!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఒకే పర్యాయం ఏర్పడ్డప్పటికీ, తెలంగాణ రాష్ట్రానికి లేని రాజధాని సమస్య ఆంధ్రప్రదేశ్‌ను, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబును వేధిస్తోంది. 2015 జూన్ రెండో తేదీ నుండి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రావతరణ ఉత్సవాలను భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఏపీ ప్రభుత్వం అలాంటి ప్రయత్నాలు చేయలేపోతోంది.
ఏపీ ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడు నిర్వహించాలన్న అంశంపై కూడా ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఆరునెలల క్రితమే ఈ అంశంపై మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి, జూన్ 2 వ తేదీనే ఏపీ ఆవిర్భావదినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించారు. దీనిపై మిశ్రమ స్పందన వచ్చింది. దీంతో, ప్రభుత్వం పునరాలోచనలో పడింది.
13 జిల్లాలతో కూడిన ఎపి ఏర్పడి ఏడాది పూర్తయినప్పటికీ, ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు ఎక్కువ సమయం రాజధాని కోసం వెచ్చించాల్సి వస్తోంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు చేనేత కార్మికులకు రుణమాఫీ తదితర ఎన్నికల హామీలను నెరవేర్చడానికి సమయం లభించడం లేదన్న అసంతృప్తి పాలకుల్లో కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌ను విభజన చేసినప్పటికీ, ఏపీకి రాజధాని ఏదో చెప్పలేదు. ఆ దిశలో ఎలాంటి కసరత్తు చేయలేదు. హైదరబాద్ నగరాన్ని పది సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా వినియోగించుకోవచ్చని మాత్రమే ప్రకటించింది.
ఏపీ సరిహద్దుల నుండి హైదరాబాద్ కనీసం 200 నుండి 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దాంతో తెలంగాణాతో అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. వాహనాల పన్ను తదితర అంశాల్లో పేచీలు వచ్చాయి.
ఈ పరిస్థితిలోనే ఏపీ ప్రజల్లో రాజధాని అంశమే ప్రధానంగా చర్చకు వస్తోంది. సొంత రాజధాని కావాలన్న తపన అందరిలో ఉండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ అంశానికే ప్రాధాన్యత ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications