కశ్మీర్ ఎన్‌కౌంటర్‌లో జవాన్ జశ్వంత్ రెడ్డి వీరమరణం-రూ.50లక్షలు ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం జగన్
ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో వీరమరణం పొందిన గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన జవాన్ జశ్వంత్ రెడ్డి(23) కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రూ.50 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. దేశ రక్షణ కోసం జశ్వంత్ రెడ్డి చేసిన ప్రాణత్యాగం మరువలేనిది అని... ఆయన సేవలు వెలకట్టలేనివి అని పేర్కొన్నారు. జశ్వంత్ రెడ్డి ధైర్యసాహసాలకు దేశమంతా గర్విస్తోందన్నారు. జశ్వంత్ రెడ్డి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉండాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం జగన్ వెల్లడించారు.
ప్రస్తుతం కడప జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్... జశ్వంత్ రెడ్డి వీరమరణం గురించి తెలియగానే స్పందించారు. అప్పటికప్పుడు ఆ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించారు.

జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లా సుందెర్‌బని సెక్టార్‌లో భారత జవాన్లకు,ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో జవాన్లు మరుపోలు జశ్వంత్ రెడ్డి,శ్రీజిత్ అమరులయ్యారు. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో జవాన్లు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా జవాన్ల పైకి కాల్పులు జరిపారు. ఇరువురి మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు అమరులవగా ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు పాకిస్తాన్‌కి చెందినవారిగా అనుమానిస్తున్నారు.
Recommended Video
జశ్వంత్ రెడ్డి స్వగ్రామం గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని దరివాడకొత్తపాలెం. ఐదేళ్ల క్రితం జశ్వంత్ రెడ్డి ఆర్మీలో చేరారు. కొద్ది నెలల క్రితం సెలవుల్లో జశ్వంత్ రెడ్డి ఇంటికి రాగా తల్లిదండ్రులు అతనికి ఓ పెళ్లి సంబంధం ఖాయం చేశారు.ప్రస్తుతం వారు ఆ పనుల్లో నిమగ్నమై ఉండగానే జశ్వంత్ రెడ్డి వీరమరణం పొందారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. శుక్రవారం(జులై 9) రాత్రికి జశ్వంత్ రెడ్డి భౌతిక కాయం స్వగ్రామానికి చేరనుంది. అధికారిక లాంఛనాలతో శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications