పుట్టినరోజు నాడు వైఎస్ జగన్ షెడ్యూల్ ఇదే: ఇక జనం మధ్యే: 23న కొప్పర్తి క్లస్టర్‌కు ప్రారంభం
ఏలూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. జనం బాట పట్టనున్నారు. తన పుట్టినరోజును పురస్కరించుకుని జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు. దశలవారీగా 13 జిల్లాల్లోనూ పర్యటించడానికి సమాయాత్తమౌతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆ తరువాత సొంత జిల్లాకు బయలుదేరి వెళ్తారు. మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటిస్తారు.
పశ్చిమగోదావరి జిల్లా తణుకుతో ఈ దశలవారీగా పర్యటనలను మొదలు పెట్టినట్టే. ఉదయం 10.15 నిమిషాలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి వెళ్తారు. 11 గంటలకు తణుకు టౌన్ చేరుకుంటారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం అక్కడే బహిరంగసభలో ప్రసంగిస్తారు. అనంతరం జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన గృహనిర్మాణ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తాడేపల్లికి తిరుగు ప్రయాణమౌతారు.
ఒక్కరోజు విరామం తరువాత మళ్లీ కడప జిల్లా పర్యటనకు వైఎస్ జగన్ బయలుదేరి వెళ్లనున్నారు. 23, 24, 25 తేదీల్లో సొంత జిల్లాలో పర్యటిస్తారు. తన సొంత నియోజకవర్గం పులివెందులలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. జిల్లా పర్యటన సందర్భంగా 23వ తేదీన కడప సమీపంలోని కొప్పర్తి వద్ద నిర్మించిన ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, మెగా ఇండస్ట్రీయల్ హబ్‌ను ప్రారంభిస్తారు. 23 పరిశ్రమలకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.

మెగా ఇండస్ట్రీయల్ హబ్, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ క్లస్టర్‌లో సుమారు మూడు కిలోమీటర్ల మేర ఫోర్ వే లైన్ రహదారిని ప్రభుత్వం నిర్మించింది. దీనికోసం 20 కోట్ల రూపాయలను వ్యయం చేసింది. ఈ క్లస్టర్‌లో ఏర్పాటయ్యే పరిశ్రమల నీటి అవసరాల కోసం బ్రహ్మంగారి మఠం వద్ద నిర్మించిన బ్రహ్మం సాగర్ నుంచి 0.6 టీఎంసీల నీటిని ఇక్కడికి తరలిస్తారు. దీనికి అవసరమైన పైప్‌లైన్ల పనులను ప్రభుత్వం ప్రారంభించింది.
అనంతరం ఆయన ఇడుపులపాయకు చేరుకుంటారు. ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడానికి స్వస్థలానికి వెళ్లడం వైఎస్ జగన్ ఆనవాయితీ. కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకలకు హాజరవుతారు. పులివెందుల చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. కడప, రాజంపేట లోక్‌సభ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి అమ్జాద్ బాషా, తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పాలక మండలి సభ్యుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలను కలుసుకుంటారు.












Click it and Unblock the Notifications