సంక్రాంతి రోజున విషాదం: కోడిపందేల్లో కోడికత్తి తగిలి వ్యక్తి మృతి
అమరావతి: సంక్రాంతిపండగను పురస్కరించుకుని నిర్వహించిన కోడి పందేల్లో విషాదం చోటు చేసుకుంది. కోడికత్తి గుచ్చుకుని ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లిలో జరిగింది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. అనంతపల్లి గ్రామానికి సమీపంలో కోడిపందేలు నిర్వహించారు. ఈ పోటీల్లో కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి బరిలోకి దించారు. పందేలను చూసేందుకు పద్మరాజు అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు.

పోటీలు చూస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఆయనకు కోడి కత్తి గుచ్చుకుంది. దీంతో తీవ్ర రక్తస్రావం జరగడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే అతడ్ని సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే పద్మరాజు మృతి చెందాడు. ఎంతో ఆనందోత్సాహాల మధ్య జరుగుతున్న పోటీల్లో ఈ ఘటన చోటు చేసుకోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఏపీలో సంక్రాంతి అంటే కొత్త అల్లుళ్లు, కోడి పందేలే గుర్తుకొస్తాయి. ఈసారి కూడా కోడిపందేలు చాలా చోట్ల కొనసాగుతున్నాయి. కరోనా కారణంగా గత రెండు మూడేళ్లుగా సరిగా నిర్వహించలేకపోగా.. ఈసారి మాత్రం పెద్ద ఎత్తున కోడిపందేలు నిర్వహిస్తున్నారు. మరోవైపు, పోలీసులు పలు చోట్ల కోడిపందేలను అడ్డుకుంటున్నారు.












Click it and Unblock the Notifications