ఎంసెట్: నిమిషం ఆలస్యమైంది, అనుమతించలేదు
హైదరాబాద్: ఏపీ ఎంసెట్ పరీక్షకు నిమిషం ఆలస్యమైందని ఓ విద్యార్ధిని పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని కూకట్ పల్లిలోని ఎంఎన్ఆర్ కాలేజీలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కాలేజీకి వచ్చేందుకు ఆలస్యమైందని విద్యార్ధిని తల్లిదండ్రులు ఎంఎన్ఆర్ కాలేజీ అధికారులకు విన్నవించినట్లు తెలుస్తోంది. అయినా సరే నిమిషం దాటిపోయిందని, విద్యార్ధిని పరీక్ష రాసేందుకు అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.
దీంతో ఆగ్రహించిన విద్యార్ధిని తల్లిదండ్రులు కాలేజీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అయినా సరే అధికారులు పరీక్ష రాసేందుకు అమతించకపోవడంతో కాలేజీ ఎదుట విద్యార్ధిని తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఎంసెట్ పరీక్ష కోసం తాను చదివిన చదువంతా వృధాగా పోయిందని విద్యార్ధిని కన్నీరుమున్నీరువుతుంది.

ఇది ఇలా ఉంటే ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో పరీక్షకు కొంచెం ఆలస్యమైనా అనుమతిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఎపీ ఎంసెట్ పరీక్షకు సంబంధించి హైదరాబాద్‌లో 39 సెంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఇంజనీరింగ్, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5:30 గంటల వరకు మెడిసిన్, అగ్రికల్చర్ పరీక్ష జరుగనుంది.
కాకినాడ జేఎన్‌టీయూలో జరిగిన కార్యక్రమంలో ఇంజనీరింగ్ పేపర్ సెట్‌కోడ్ ఎన్1 పత్రాన్ని ఎంపిక చేశారు. అగ్రికల్చరల్, మెడిసిన్ విభాగానికి ఎల్1 సెట్‌ను ఎంపిక చేసి వైద్య ఆరోగ్య శాఖామంత్రి కామినేని శ్రీనివాస్ విడుదల చేశారు.












Click it and Unblock the Notifications